ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో ఉన్న ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చిగా గుర్తింపు పొందిన క్రీస్తు జ్యోతి ప్రార్థన మందిరంలో క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి,వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాయిని రాజేందర్ రెడ్డి,వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన ఈ ప్రార్థన మందిరంలో వివిధ దేశాల నుండి,వివిధ రాష్ట్రాల నుండి,అలాగే పలు జిల్లాల నుండి అత్యధిక సంఖ్యలో భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.వేలాదిగా చేరిన విశ్వాసులు భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించడంతో పరిసర ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ..శాంతి,ప్రేమ,కరుణ సందేశాన్ని ప్రపంచానికి అందించిన ఏసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి అత్యంత అవసరమని పేర్కొన్నారు.మత సామరస్యాన్ని కాపాడుకుంటూ,పరస్పర గౌరవంతో జీవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.క్రిస్మస్ పండుగ ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడుతుందని అన్నారు.అంతకుముందు చర్చి వ్యవస్థాపకులు పాస్టర్ పాల్సన్ రాజ్ మరియు పాస్టర్ ప్రకాష్ రాజ్లు ప్రత్యేక ప్రసంగాలు నిర్వహించి,ఏసుక్రీస్తు జన్మ ఉద్దేశ్యం మానవత్వం,సేవ,ప్రేమను ప్రపంచానికి చాటడమేనని వివరించారు.అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి,వేడుకలకు హాజరైన ఎమ్మెల్యేలను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు,మహిళలు,యువత పెద్ద సంఖ్యలో పాల్గొని క్రిస్మస్ గీతాలు ఆలపిస్తూ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.భారీ భక్తజన సమూహం తరలివచ్చినప్పటికీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వేడుకలు శాంతియుతంగా ముగిశాయి.