మూడు రోజులు మౌనం -- శవం దొరికాక బేరం!
విద్యార్థి ప్రాణం చౌకా..?డబ్బుతో దోషాలు కప్పిపుచ్చుడా!
అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థి మిస్సింగ్..
ఘటనపై స్పందించని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
సాగర్ కాలువలో దూకి ఆత్మహత్య..
మూడు రోజులు మౌనం — శవం దొరికాక బేరం!
అధికారికి విద్యార్థి సంఘాలు సైతం వత్తాసు..
ఖమ్మం :
ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి ప్రాణాన్ని బేరం పెట్టారా..!? హాస్టల్ నుంచి తప్పిపోయి మూడు రోజులు అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోలేదా..!? మిస్సింగ్ అయిన మూడు రోజులకు సాగర్ కాలువలో శవంగా తేలడంతో సదరు విద్యార్థి తల్లిదండ్రులతో ఆర్థిక సాయం పేరుతో బేరం కుదుర్చుకున్నారా..!? విద్యార్థుల హక్కుల కోసం పనిచేయాల్సిన విద్యార్థి, యువజన సంఘాలతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు సైతం ఉద్యోగికి వత్తాసు పలికి ఇటు ప్రభుత్వాన్ని, అటు ఉన్నతాధికారులను తప్ప్పుదోవ పట్టిస్తూ.. ఆర్థిక సాయం పేరుతో చేతులు దులుపుకుంటున్నారా…!? అన్న చర్చ ఇప్ప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం ఎనఎస్‌పీ క్యాంపులోని ఎస్సీ(సి) బాలుర వసతి గృహంలో జరిగిన ఓ ఘటన ప్రభుత్వ సంక్షేమ వ్యవస్థ నిర్లక్ష్యానికి సాక్షంగా నిలిచింది. ఇదే హాస్టల్‌లో ఉంటూ 8వ తరగతి చదువుతున్న సంజయ్‌కుమార్(17) అనే విద్యార్థి తన తమ్ముడు అరుణ్‌కుమార్‌తో గొడవ పడ్డాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే మందలిస్తారన్న భయంతో వసతి గృహం నుంచి అదశ్యమయ్యాడు. ఒక విద్యార్థి మూడు రోజులుగా అదృశ్యమైనా, బాధ్యత వహించాల్సిన వసతి గృహ సంక్షేమ అధికారి మాత్రం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక విద్యార్థి కనిపించడం లేదన్న సమాచారమే పెద్ద ప్రమాద ఘటన అయినా, కనీసం విద్యార్థి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సాగర్ కాలువలో సంజయ్‌కుమార్ మతదేహం దొరకడం ఈ ఘటన మరింత విషాదంగా మారింది. అయితే హాస్టల్‌లో పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు అందుబాటులో లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందన్న వాదనలు ఉన్నాయి. వారే ఉండి ఉంటే ఈ ఘటన జరిగే అవకాశం ఉండేది కాదని కొందరు అక్కడి విద్యార్థులు సైతం వాపోతున్నారు.
విద్యార్థి ప్రాణం కోసం కాదు, తమ కుర్చీ కోసం మాత్రమే ఆలోచించే ఈ అధికారులు, మృతదేహం బయటపడిన తర్వాతే హడావుడిగా రంగంలోకి దిగడం అమానుషమని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు. శవాన్ని తల్లిదండ్రులకు అప్పగిస్తూ, ఆర్థిక సాయం పేరుతో నోరు మూయించాలన్న ప్రయత్నం చూసి సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధుల పట్ల ఘోర నిర్లక్ష్యం వహించిన వసతి గృహ సంక్షేమ అధికారిని కాపాడేందుకు సంక్షేమ అధికారుల సంఘం నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల ప్రతినిధులు సైతం బేరసారాలు కుదిర్చి సదరు అధికారిని కాపాడేందుకు చూస్తున్నారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.