ట్రక్ షీట్ లు తెప్పించి న్యాయం చేస్తాం
ఖమ్మంజిల్లా వేంసూరు మండల పరిధిలోని లచ్చన్నగూడెం గ్రామంలో గతేడాది సారవ వరి పంట కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో 12/23 సన్నరకం (సాంబ) వరి ధాన్యానికి క్వింటాకు 4 నుండి 5 కేజీల వరకు కోత విధిస్తున్నట్లు వారికి అనుకూలంగా ఉన్న కొందరి రైతులకు తెలిపి 12 కేజీలు చొప్పున కోత విధించి మిల్లర్లు సొమ్ము తమ బ్యాంకు ఖాతాలలో జమ చేశారని తమకు న్యాయం చేయాలని నష్టపోయిన రైతులు గ్రామ రైతు సంఘం అధ్యక్షులు ఇమ్మడి మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సోమవారం ఖమ్మం నగరంలోని కలక్టరేట్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ కు తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు,శీలం సత్యనారాయణరెడ్డి,అర్వపల్లి జగన్మోహన్ రావు,సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ ల నాయకత్వంలో మోర పెట్టుకున్నారు.
సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలక్టర్ కు ఇచ్చారు.ఆయన స్పందిస్తూ పరిశీలించి న్యాయం చేయాలని జిల్లా సివిల్ సప్లై డి.ఏం.శ్రీలత కు బాధ్యత అప్పగించారు.ఈ సందర్భంగా రైతులు శ్రీలత కు వివరాలు వెల్లడిస్తూ ట్రక్ షీట్లు ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదని,గడప గడపకు తిరుగుతూ ముందే కోత విషయం చెప్పారని,రైతులు ఇష్టపడి ఒప్పుకున్నారని రాసిన దరఖాస్తుపై మేము ఇటీవల మాకు న్యాయం చేయాలని వేంసూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశాక ఐకెపి సిబ్బంది కొంతమందితో సంతకాలు చేయించారని తెలిపారు.అట్టి తప్పుడు దరఖాస్తును మీకు వాట్సాప్ లో కూడా పెట్టీ మిమ్మలను తప్పు దోవ పట్టించడానికి యత్నాలు చేస్తున్నారన్నారు.
ప్రశాంతంగా ఉన్న గ్రామంలో రాజకీయ అడ్డుగోడలు పెడుతున్నారని నష్టపోయిన రైతులు అందరికీ పార్టీలకతీతంగా నష్టపోయిన సొమ్మును మిల్లర్ల నుండి ఇప్పించాలని శ్రీలత ను కోరారు.దీంతో అసలు సొమ్ము తో పాటు రాష్ట్ర ప్రభుత్వం రైతులపై గౌరవంతో ప్రకటించి ఇస్తున్న బోనస్ సొమ్ము కూడా నష్టపోయామని న్యాయం చేయాలని వేడుకొన్నారు.ఆమె స్పందిస్తూ నేలకొండపల్లి మిల్లర్ల నుండి అన్ని ట్రక్ షీట్స్ తెప్పించి లోపాలను పరిశీలించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో: నాయుడు శ్రీనివాసరావు,సిద్ధినిబోయిన వెంకటరమణ,బోయినపల్లి సత్యనారాయణ,పత్తేపరుపు రామాంజనేయలు,లక్ష్మయ్య,శ్రీనివాసరావు,ఇమ్మడి పుల్లారావు,మా రాఘవరావు,పోలంపల్లి హనుమంతరావు,పర్సా నాగేశ్వరరావు,ఉమ్మడి యాకోబు,రాయల నరసింహారావు,పిల్లి వెంకటేశ్వరరావు,నాయుడు నరసింహారావు,ఇమ్మడి శంకరరావు,నందికోల రాజేష్ తదితరులు పాల్గొన్నారు