మా గోడు ఆలకించిన కలక్టర్ సాబ్ కు కృతజ్ఞతలు అంటున్న లచ్చన్నగూడెం రైతులు”
ఇటీవల నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో గల లచ్చన్నగూడెం గ్రామానికి చెందిన రైతులు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మి లక్షలరూపాయల సొమ్ము దగా పడ్డట్లు లోగుట్టు అంటూ రాసిన కథనానికి స్పందన వచ్చింది.మనో ధైర్యంతో రైతులు స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు అయినా ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన అన్నదాతలు సోమవారం జిల్లా కలక్టర్ అనుదీప్ కు ప్రజావాణి లో మోర పెట్టుకున్నారు.స్పందించిన కలక్టర్ సివిల్ సప్లై డిఎం శ్రీలత కు బాధ్యత అప్పగించి మంగళవారం గ్రామంలో ముఖాముఖి విచారణకు ఆదేశాలు జారీ చేశారు.విచారణ కొరకు లచ్చన్నగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు జిల్లా డ్వామా(డి.ఆర్.డి.ఏ) ఏ. పి.డి.విజయశ్రీ వచ్చి విచారణ చేపట్టారు రైతుల నుండి వివరాలు సేకరించారు.తదుపరి చర్యలు నిమిత్తం కలక్టర్ కు నివేదిక పంపుతామని స్పష్టం చేశారు.ఎక్కువ మంది రైతులు మాకు క్వింటాకు 4లేక5 కేజీలు కోత అని చెప్పారని కానీ 12 కేజీల చొప్పున కట్ చేసి మా ఖాతాలలో సొమ్ము జమ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.మరికొందరు అసలు మాకు కటింగ్ గూర్చి ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు.ఒకరిద్దరు సమాచారం తెలిపారని విచారణలో తెలిపారు.ట్రక్ షీట్ లు ఇవ్వమని అడిగినా ఐకెపి సిబ్బంది ఇవ్వలేదని,మంగళవారం జరిగే విచారణకు కూడా అందరు రైతులకు సమాచారం ఇవ్వలేదని,కేవలం గ్రామ సర్పంచ్ చెప్పారని ఇదేమిటని ప్రశ్నించారు.ధర్నా చేసిన వారికే కాదు నష్టపోయిన సుమారు 450 మందికి న్యాయం చేయాలని విచారణాధికారులను అడిగారు.స్థూలంగా రైతులకు సమాచారం ఇవ్వడంలో లోపాలు జరిగాయని సన్నరకం ధాన్యానికి కోత విధించే అవసరం లేకున్న క్వింటాళ్లకు12 కేజీల కోత మిల్లర్లు విధించారని,ట్రక్ షీట్ లు అడిగిన రైతులకు చూయించలేదని నిర్ధారణకు వచ్చినట్లు విజయశ్రీ తెలిపారు.ఈ కార్యక్రమంలో:జిల్లా అధికారి శ్రీనివాసరావు,మండల ఐకెపి అధికారులు,సిబ్బంది,గ్రామ సర్పంచ్ పోతురాజు చక్రధర్ రావు,రైతులు, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు.తమ మోర ను ఆలకించి చర్యలు చేపట్టిన కలక్టర్ అనుదీప్ కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.రైతుల ఆధార్ కార్డులలో ఉన్న పేర్లు కాకుండా వేరే పేర్లు ట్రక్ షీట్ లలో రాసిన లోపాలు వెల్లడయ్యాయి.25 బస్తాలు అమ్మిన రైతు పేరుతో 150 బస్తాలు అమ్మినట్లు ట్రక్ షీట్ లో రాసి రైతుకు 18 బస్తాల సొమ్ము చెల్లించిన విషయం వెల్లడైంది.ఇదేమిటని విజయశ్రీ ప్రశ్నించగా సిబ్బంది ట్రక్ షీట్ లో ఎక్కువ గడులు లేక పోవడంతో అలా రాసి అసలు రైతుల ఖాతాలలో సొమ్ము జమ అయ్యేలా చూశామని ఐకెపి సిబ్బంది తెలపగా అట్టి విషయాన్ని రైతులకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.