రాజీ మార్గమే సమస్యలకు పరిష్కారం-ఎస్సై
భూపాలపల్లి జిల్లా కోర్టులో మార్చి 24 నుండి 28 వరకు నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి గోరి పోలీస్ స్టేషన్ ఎస్సై ఎస్.సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.కొత్తపల్లి గోరి మండల పరిధిలో ఉన్న పెండింగ్ కేసులకు సంబంధించిన వ్యక్తులు ఈ లోక్ అదాలత్లో పాల్గొని తమ కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని తెలిపారు.ఈ లోక్ అదాలత్లో న్యాయ నిపుణులు, అధికారులు మరియు ఇతర ప్రముఖుల సమక్షంలో స్నేహపూర్వక వాతావరణంలో ఉభయ పక్షాలకు అనుకూలంగా రాజీ ద్వారా తుదితీర్పులు ఇవ్వబడతాయని చెప్పారు.సాధారణ కోర్టు ప్రక్రియలతో పోలిస్తే తక్కువ సమయంలో, ఖర్చులు లేకుండా, సులభంగా న్యాయం పొందేందుకు లోక్ అదాలత్ మంచి వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా భార్యాభర్తల మధ్య వివాదాలు,మనోవర్తి, విడాకులు,భూవివాదాలు,సివిల్ కేసులు,చెక్కు బౌన్స్ కేసులు మరియు రాజీకి అనుకూలమైన క్రిమినల్ కేసులను ఇక్కడ పరిష్కరించుకోవచ్చని వివరించారు.చిరకాలంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా ముగించుకోవడానికి ఇది మంచి అవకాశం అని, పలుమార్లు కోర్టులకు తిరగాల్సిన అవసరం లేకుండా సుహృద్భావ వాతావరణంలో తుది పరిష్కారం పొందవచ్చని తెలిపారు.ఈ సందర్భంగా కేసుదారులు “కలహాలు విడిచి కలిసిపోండి” అనే సందేశంతో లోక్ అదాలత్లో పాల్గొని సమస్యలను పరిష్కరించుకోవాలని పోలీసులు పిలుపునిచ్చారు.ఇట్టి కేసులపై రాజీ పడాలనుకునేవారు వివరాలకు ఎస్. సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి, ఎస్సై–8712658174, కోర్ట్ కానిస్టేబుల్ అరుణ (సి డి ఓ)–8712525073 లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.లోక్ అదాలత్ ద్వారా వేగవంతమైన, ఖర్చులేని న్యాయం పొందే అవకాశాన్ని ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.