కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ
గణితం పరీక్షకు 203 మంది విద్యార్థులు హాజరు–ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్ భూపాలపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న 10వ తరగతి వార్షిక పరీక్షల పర్యవేక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శనివారం జిల్లా కేంద్రంలోని జడ్పి హెచ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.పరీక్షలు సజావుగా జరుగుతున్నాయా అనే అంశంపై ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలోని ఏర్పాట్లపై కలెక్టర్ సమగ్రంగా వివరాలు తెలుసుకున్నారు.చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మి ప్రసన్నను విద్యార్థుల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు.అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం, ఈ కేంద్రంలో మొత్తం 200 మంది రెగ్యులర్ విద్యార్థులు, 3 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, శనివారం నిర్వహించిన గణితం పరీక్షకు మొత్తం 203 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా,కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.అదేవిధంగా, పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు.విద్యార్థులకు అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అనే విషయంపై వివరాలు తెలుసుకున్నారు.ఎవరైనా విద్యార్థులకు అస్వస్థత కలిగిన వెంటనే చికిత్స అందించేందుకు అవసరమైన అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పరీక్షల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈ తనిఖీలో ఎంపీడీఓ నాగరాజు, డిపార్ట్మెంటల్ అధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.