భాగిర్తిపేట క్రాస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల పరిధిలోని భాగీరథిపేట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం ఉదయం భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భూపాలపల్లి నుండి హనుమకొండ వైపు వెళ్తున్న పరకాల డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు, ఎదురుగా హనుమకొండ నుండి భూపాలపల్లి వైపు వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారు నడుపుతున్న హనుమకొండ ఆర్టీఓ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న తేజావత్ రజిత (39) తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా, కారులోనే ప్రయాణిస్తున్న మరొక ప్రయాణికురాలు భూక్య లక్ష్మి (43)కి అదృష్టవశాత్తు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రయాణికులు స్పందించి క్షతగాత్రులను కాపాడారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిద్దరినీ తక్షణ ప్రాథమిక చికిత్స నిమిత్తం పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, బాధితులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం హనుమకొండలోని ఎన్ఎస్ఆర్ అపోలో హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రజిత, లక్ష్మిల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు, ప్రాణాపాయం తప్పినట్లు వైద్య వర్గాల ద్వారా సమాచారం అందింది. ప్రమాదం జరిగిన సమయంలో పరకాల డిపో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం కారణంగా ప్రధాన రహదారిపై కొంత సమయం పాటు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానిక ఎస్సై సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.