విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాగమయి నిరసన ర్యాలీ
ప్రజాస్వామ్య హక్కులను కాలరాయొద్దని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు సత్తుపల్లి నియోజకవర్గంలో బుధవారం ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.
సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీలో కళాశాల విద్యార్థినీ, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తుకు బలమైన పునాదని అన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం, విద్యా వ్యవస్థలో పారదర్శకత కోసం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య హక్కని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రశ్నించే వారిని అణచివేయడం ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని, విద్యార్థులు, యువత ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ మాట్లాడుతూ సోనమ్ వాంగ్చుక్ ఉద్యమం, యువత చేపడుతున్న పోరాటాలు దేశంలో ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించే ఉద్యమాలని అన్నారు. ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు.
విద్య, ఉపాధి, యువత భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే చర్యలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.