కేటీఆర్ నిరుద్యోగ భరోసా యాప్ ఆవిష్కరణ
నిరుద్యోగ యువతపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చూపుతున్న నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా యువత పిడికిలి బిగిస్తోందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని బుధవారం హనుమకొండలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.రాష్ట్ర వికలాంగుల సంస్థ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో, ‘విన్నర్స్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్’ సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకుల కోసం ఉచితంగా రూపొందించిన “కేటీఆర్ నిరుద్యోగ భరోసా ఆన్లైన్ కోచింగ్ యాప్”ను పార్టీ ముఖ్య నేతలు ఘనంగా ఆవిష్కరించారు. ఈ నెల 24వ తేదీన కేటీఆర్ జన్మదినం ఉన్నందున నేతలు ముందస్తుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ… మన దేశ యువత ప్రపంచ నలుమూలలా అన్ని రంగాలలో తమ ప్రతిభతో నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అయితే, అధికారంలోకి వస్తే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భ్రమలు కల్పించిన ప్రభుత్వాలు, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను గాలికి వదిలేసి నియంతృత్వ పరిపాలన కొనసాగిస్తున్నాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 31 నెలలు అవుతున్నా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తమ హక్కుల కోసం ప్రశ్నించిన నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగులపై ఆంక్షలు విధించడం, దాడులకు పాల్పడటం ఈ ప్రభుత్వంలో పరిపాటిగా మారిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో హైదరాబాద్ వచ్చి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు భరోసా ఇచ్చిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి,నేడు యువత పడుతున్న కష్టాలు కనిపించడం లేదని విమర్శించారు.మరోవైపు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కూడా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి పన్నెండేళ్లయినా ఎటువంటి పురోగతి చూపలేదని ఆరోపించారు.ఢిల్లీ వీధుల్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై నిరసన తెలిపిన విద్యార్థుల సమస్యలను సానుకూలంగా పరిష్కరించాల్సింది పోయి,కేంద్రం నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.ఈ రకంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ప్రజలను వంచించాయని దుయ్యబట్టారు.తెలంగాణ సాధించిన బీఆర్ఎస్ పార్టీ, తన పదేళ్ల పాలనలో ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల్లో లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించిందని గండ్ర గుర్తుచేశారు.నేడు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ నిరుద్యోగులకు,బాధితులకు అండగా ఉండి పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ, కష్టపడి చదివి సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన చరిత్రను లిఖించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్,టీఎస్ఎంఎస్ఐడీసీ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.