
45 నిమిషాల పాటు గుండె, శ్వాసక్రియ నిలిచిపోయినా వైద్యుల ప్రయత్నాలతో గుండె స్పందన పునరుద్ధరణ
వెంటిలేటర్‌పై చికిత్స..మెదడుకు తీవ్ర నష్టం.. 72 గంటల తర్వాత కీలక వైద్య సమీక్ష
వరంగల్/సికింద్రాబాద్,(ఈ69 న్యూస్)
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (54) తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయ స్థితిలో సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఊపిరితిత్తుల్లో రక్తనాళాలు మూసుకుపోయే మాసివ్ పల్మోనరీ ఎంబోలిజమ్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి మంగళవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో వెల్లడించింది.అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సుదర్శన్ రెడ్డిని తొలుత వరంగల్‌లోని రోహిణి ఆసుపత్రికి తరలించారు.అప్పటికే తీవ్ర షాక్‌కు గురైన ఆయన గుండె, శ్వాసక్రియ సుమారు 45 నిమిషాల పాటు నిలిచిపోయాయి.వైద్యులు సీపీఆర్, ఏసీఎల్ఎస్ అత్యవసర చికిత్సలు అందించి గుండె స్పందనను తిరిగి పునరుద్ధరించారు.అనంతరం రక్తం గడ్డకట్టడాన్ని కరిగించే థ్రోంబోలిసిస్ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది. క్రిటికల్ కేర్, పల్మోనాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ నిపుణుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. మందుల సహాయంతో రక్తపోటు, ఇతర ప్రాణాధార సూచీలు, అవయవాల పనితీరును నిలకడగా ఉంచుతున్నారు.గుండె స్పందన ఎక్కువసేపు నిలిచిపోవడంతో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందక తీవ్ర నష్టం జరిగినట్లు ఈఈజీ, ఎంఆర్ఐ, టీసీడీ పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన ఎలాంటి బాహ్య స్పందనలకు స్పందించడం లేదని వెల్లడించారు.బుధవారం 72 గంటల వైద్య పరిశీలన అనంతరం మరోసారి సమగ్ర న్యూరో అసెస్మెంట్ నిర్వహించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా సమాచారం వెల్లడించనున్నట్లు యశోద ఆసుపత్రి వైద్య బృందం తెలిపింది.