విద్యార్థుల భవిష్యత్తుకు చట్టపరమైన రక్షణ కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం
విద్యార్థుల భవిష్యత్తుకు చట్టపరమైన రక్షణ కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం
పరీక్షా పత్రాల లీకేజీలపై ఉక్కుపాదం.. మరింత కఠిన చట్టానికి కేంద్రం సిద్ధం: బీజేపీ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్
హైదరాబాద్: దేశంలో ప్రజా పరీక్షల నిర్వహణను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తుకు చట్టపరమైన రక్షణ కల్పించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తోందని బీజేపీ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ తెలిపారు.
పరీక్షా పత్రాల లీకేజీలు, అవకతవకలు, సంఘటిత మోసాలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో ఇప్పటికే అమలులో ఉన్న “పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–2024”ను మరింత పటిష్ఠం చేస్తూ “ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్–2026 సవరణ బిల్లు”ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ చట్ట సవరణల ద్వారా దేశంలోని లక్షలాది మంది విద్యార్థులకు న్యాయం జరిగేలా, వారి కష్టానికి తగిన ఫలితం దక్కేలా, పరీక్షల నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్వరూప గౌడ్ అన్నారు.
పరీక్షల నిర్వహణలో సాంకేతిక భద్రత, డిజిటల్ పర్యవేక్షణ, పారదర్శకత, జవాబుదారీతనం వంటి అంశాలను మరింత బలోపేతం చేయడానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి నేతృత్వంలో ఆరుగురు నిపుణులతో కూడిన హైపవర్ టాస్క్‌ఫోర్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ సూచనల ఆధారంగా పరీక్షల నిర్వహణలో అత్యాధునిక సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టి, లీకేజీలకు ఆస్కారం లేకుండా బలమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో గతంలో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారని, వారి శ్రమ వృథా అయిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా పలు పరీక్షల్లో అవకతవకలు వెలుగుచూసినా, వాటిని నిరోధించేందుకు సమగ్ర చట్టాన్ని తీసుకురాలేదని విమర్శించారు.
అయితే మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల ప్రయోజనాలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని చట్టపరమైన రక్షణ కల్పించే దిశగా చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని పేర్కొన్నారు.
రాధాకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో విస్తృత స్థాయిలో సంస్కరణలు చేపట్టిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో పారదర్శకతను మరింత పెంచిందని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం లేదా ఇతర పరిపాలనా లోపాలు వెలుగుచూసిన సందర్భాల్లో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుందని, దాదాపు 47 మంది అధికారులను బదిలీ చేసి బాధ్యతను నిర్ధారించిందని చెప్పారు. తప్పు చేసిన వారెవరైనా ఉపేక్షించబోమనే స్పష్టమైన సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
ప్రస్తుతం ప్రతిపాదిత సవరణల ద్వారా పరీక్షా పత్రాల లీకేజీ, డమ్మీ అభ్యర్థులు, డిజిటల్ హ్యాకింగ్, సంఘటిత మోసాలు, ఇతర అక్రమాలకు పాల్పడే వ్యక్తులు, సంస్థలు, ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేలా చట్టాన్ని బలోపేతం చేస్తున్నారని స్వరూప గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రూ.1 కోటి జరిమానాను రూ.15 కోట్ల వరకు పెంచే ప్రతిపాదనతో పాటు, కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించే నిబంధనలను కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఇటువంటి కఠిన శిక్షల వల్ల భవిష్యత్తులో పరీక్షల నిర్వహణపై దుష్ప్రభావం చూపే శక్తులకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని అన్నారు.
ఈ చట్టం పరిధిలో యూపీఎస్సీ (UPSC), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB), ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS), నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే పరీక్షలతో పాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని ప్రజా పరీక్షలు ఉంటాయని ఆయన వివరించారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల్లో ఏకరీతి ప్రమాణాలు అమలవుతాయని, అభ్యర్థుల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు.
పరీక్షా లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి, నాలుగు నెలల్లోపు దర్యాప్తు పూర్తి చేసి న్యాయపరమైన చర్యలు చేపట్టేలా వ్యవస్థను రూపొందిస్తున్నారని తెలిపారు. దీంతో కేసుల విచారణ సంవత్సరాల తరబడి సాగకుండా వేగంగా తీర్పులు వెలువడే అవకాశం ఉంటుందని, నేరస్తులకు తక్షణ శిక్షలు పడే విధంగా చట్టాన్ని బలోపేతం చేస్తున్నారని చెప్పారు.
ఇటీవల జరిగిన పరిణామాల్లో విద్యార్థి ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం నేరుగా చర్చలు జరిపి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా సమస్యల పరిష్కారానికి సంభాషణ, సంప్రదింపులకే ప్రాధాన్యత ఇస్తోందని మరోసారి నిరూపించిందన్నారు.
విద్యార్థుల ఆందోళనలను సానుకూలంగా స్వీకరిస్తూ, పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పరీక్షా వ్యవస్థను భారత్‌లో నెలకొల్పాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేస్తాయని స్వరూప గౌడ్ అభిప్రాయపడ్డారు. నిజాయితీగా శ్రమించే ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా, ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యం లభించేలా రూపొందిస్తున్న ఈ చట్టపరమైన సంస్కరణలు భారత విద్యా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తాయని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతూ, ప్రజా పరీక్షల విశ్వసనీయతను మరింత బలోపేతం చేసే ఈ నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తున్నామని బీజేపీ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ తెలిపారు.