పర్వతగిరిలో మళ్లీ ఘోర ప్రమాదం
మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనాలు ఢీ-ముగ్గురికి తీవ్ర గాయాలు*
•10 రోజుల క్రితమే 3 మంది మృతి- స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని ప్రజల డిమాండ్
వరంగల్ జిల్లా:పర్వతగిరి,మండల కేంద్రంలోని పాత కారంపొడి మిల్లు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.వడ్లకొండ గ్రామానికి చెందిన ఊరుగొండ సతీష్, కన్నె హరిష్లతో పాటు గోరుగుట్ట తండాకు చెందిన బానోత్ సోమ్లా ప్రయాణిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి.అతివేగం.. మూలమలుపే శాపం:రహదారిపై ఉన్న ప్రమాదకరమైన మూలమలుపు వద్ద వాహనాల అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రమాదంలో తీవ్ర రక్తగాయాలైన ముగ్గురిని స్థానికులు 108 అత్యవసర వాహనంలో వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.పర్వతగిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.10 రోజుల క్రితమే 3 మంది మృతి:
ప్రస్తుతం ప్రమాదం జరిగిన స్థలానికి కొద్ది దూరంలోనే.. మోడల్ స్కూల్ వద్ద కేవలం 10 రోజుల క్రితం జరిగిన మరో ఘోర రోడ్డు ప్రమాదంలో సోమారం గ్రామానికి చెందిన వడ్లకోండ ఎల్లగౌడ్, మహ్మద్ అహ్మద్‌లతో పాటు పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన బుద్దే చరణ్ అక్కడికక్కడే మృతి చెందారు.ఆ ఘోర విషాదం నుంచి ఆయా కుటుంబాలు, స్థానికులు ఇంకా తేరుకోకముందే అదే రహదారిపై మళ్లీ ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.వరుస ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ ప్రమాదకర మలుపు వద్ద అధికారులు తక్షణమే స్పందించి వేగ నిరోధకాలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.పర్వతగిరి ఎస్ఐ బి. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థులకు,గ్రామాల్లో ప్రజలకు మత్తు పానీయాలు తాగి వాహనాలు నడపవద్దని ప్రతి గ్రామంలో తెలియజేస్తున్నామని అన్నారు.ప్రజలు ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోకుండా వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు.ఇప్పటికైనా కుటుంబ సభ్యుల క్షేమం కోసం ప్రజలు జాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాలు కాపాడుకోవాలని కోరారు.