E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ29 June, 2026E69NEWS

వరంగల్‌కు కొత్త పోలీస్ కమిషనర్‌గా ఎన్.శ్వేత

2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారిణికి కీలక బాధ్యతలు

ఈ69 న్యూస్ వరంగల్, జూన్ 29

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఎన్. శ్వేతను నియమించింది.ప్రస్తుతం హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ (లా అండ్ ఆర్డర్)గా విధులు నిర్వహిస్తున్న ఆమె, సన్‌ప్రీత్ సింగ్ స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.2012 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐపీఎస్ అధికారిణి అయిన ఎన్. శ్వేత తన సేవా ప్రస్థానంలో పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించి ప్రత్యేక గుర్తింపు పొందారు.కామారెడ్డి జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో నేరాల నియంత్రణ, ప్రజలకు చేరువైన పోలీసింగ్‌తో ప్రశంసలు అందుకున్నారు.అనంతరం సిద్దిపేట పోలీస్ కమిషనర్‌గా సేవలందించి శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు.తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్ డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్‌లో డీసీపీగా బాధ్యతలు నిర్వహించిన ఆమె, ఇటీవల హైదరాబాద్ నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్‌గా నియమితులై నగరంలోని కీలక ప్రాంతాల శాంతిభద్రతల పర్యవేక్షణలో సమర్థ నాయకత్వాన్ని ప్రదర్శించారు.క్రమశిక్షణ, పారదర్శకత, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్, మహిళల భద్రత, సైబర్ నేరాల నియంత్రణ వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి సారించే అధికారిణిగా ఎన్. శ్వేతకు పోలీసు శాఖలో మంచి పేరు ఉంది.వరంగల్ పోలీస్ కమిషనర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, సైబర్ నేరాల అరికట్టడం, మాదకద్రవ్యాల నిర్మూలన వంటి అంశాలకు మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు వరంగల్ పోలీస్ కమిషనర్ బాధ్యతలతో పాటు భద్రాద్రి జోన్-4 డీఐజీగా అదనపు బాధ్యతలను కూడా అప్పగించిందని సమాచారం.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *