ఎల్ హెచ్ పి ఎస్ పోరాటంతోనే ఇళ్ల సర్వే
- సింగరేణి పేలుళ్లతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన అధికారులు
- బాధిత కాలనీల్లో హర్షాతిరేకాలు నంగార భేరి లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే సింగరేణి గనుల పేలుళ్ల ధాటికి దెబ్బతిన్న ఇళ్ల సర్వే ప్రక్రియ ప్రారంభమైందని ఆ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా సింగరేణి ప్రభావిత ప్రాంతాల వర్కింగ్ ప్రెసిడెంట్ భానోత్ నందు నాయక్, జిల్లా అధ్యక్షుడు ధర్మసోత్ దశరథ్ నాయక్ తెలిపారు. సత్తుపల్లి మండల తహసీల్దార్ ఆదేశాల మేరకు మంగళవారం మండల పరిధిలోని కిష్టారం బీసీ కాలనీలో రెవెన్యూ అధికారులు పర్యటించారు. సింగరేణి మైనింగ్ పేలుళ్ల (బ్లాస్టింగ్) కారణంగా ఇళ్లకు పడిన పగుళ్లను, వాటి తీవ్రతను అధికారులు నిశితంగా పరిశీలించి సర్వే నమోదు చేశారు.
- ఈ సందర్భంగా ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుగులోతు రాజేష్ నాయక్, గుగులోతు కృష్ణా నాయక్ కాలనీని సందర్శించి సర్వే తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీ మహిళలు, గ్రామస్థులు నాయకులను కలిసి హర్షం వ్యక్తం చేశారు.గతంలో తాము పడుతున్న ఇబ్బందులపై ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలు, పోరాటాలు చేయడం వల్లే నేడు ప్రభుత్వ యంత్రాంగం కదలివచ్చిందని కాలనీవాసులు పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేలా చొరవ చూపిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ఈ సందర్భంగా గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో: సంఘం ప్రతినిధులు సుభాని, బాజీ, పండు నాయక్, కృష్ణా నాయక్‌తో పాటు కిష్టారం గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Nice.