తహసీల్దార్ కారును ఢీకొట్టిన ట్రాక్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే అధికారిక సమీక్షా సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న కొత్తపల్లి గోరి తహసీల్దార్ కారుకు తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. నిన్న సాయంత్రం సుమారు 3:30 గంటల ప్రాంతంలో కర్కపల్లి గ్రామ శివారులోని సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ (బ్రిక్స్ ఫ్యాక్టరీ) సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.స్థానికులు,బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గోరి తహసీల్దార్ హేమ తన సిబ్బందితో కలిసి కలెక్టర్ కార్యాలయ మీటింగ్‌కు కారులో బయలుదేరారు. ఆ సమయంలో కారులో తహసీల్దార్‌తో పాటు జూనియర్ అసిస్టెంట్ రాజయ్య, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ (వి ఆర్ ఏ) బింగి నర్సీంహా స్వామి ప్రయాణిస్తున్నారు. కారును ప్రభుత్వ డ్రైవర్ గొడుగు సతీష్ నడుపుతున్నారు.కారు కర్కపల్లి వద్ద గల మహేందర్ అనే వ్యక్తికి చెందిన సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీ ప్రాంతానికి చేరుకోగానే,ఒక్కసారిగా ఒక ట్రాక్టర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా దూసుకువచ్చి తహసీల్దార్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షణాల వ్యవధిలో తహసీల్దార్ కారు డ్రైవర్ గొడుగు సతీష్ అత్యంత సమయస్ఫూర్తితో, అప్రమత్తంగా వ్యవహరించి వాహనాన్ని పక్కకు నియంత్రించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల కారు లోపల ఉన్న తహసీల్దార్ హేమ, జూనియర్ అసిస్టెంట్ రాజయ్య, వీఆర్ఏ నర్సీంహా స్వామి ఎలాంటి గాయాలు కాకుండా ప్రాణాపాయం నుండి తృటిలో బయటపడ్డారు. అయితే, ట్రాక్టర్ బలంగా ఢీకొనడం వల్ల తహసీల్దార్ అధికారిక కారు ఒకవైపు ఉన్న డోర్లు (తలుపులు) పూర్తిగా నలిగిపోయి తీవ్రంగా ధ్వంసమయ్యాయి.ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ డ్రైవర్‌ను జర్పుల శ్రీధర్‌గా గుర్తించారు.ఈ ఘటనపై తాసిల్దార్ హేమ పోలీసులకు సమాచారం అందించి గణపురం ఎస్సై కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.తహసీల్దార్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ జర్పుల శ్రీధర్‌పై నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కేసు నమోదు చేసి,దర్యాప్తు జరుపుతున్నారు. తహసీల్దార్ కారుకు ప్రమాదం జరిగిందన్న విషయం తెలియడంతో తోటి రెవెన్యూ అధికారులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురయ్యారు,అయితే అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.