డిటిఓ వెంకన్న మృతిపై భూపాలపల్లిలో విచారణ అధికారి చంద్రశేఖర్ గౌడ్ సమగ్ర దర్యాప్తు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డిటిఓ) వెంకన్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ నెల 22వ తేదీ ఉదయం భూపాలపల్లి ఆర్టీఓ ఆఫీస్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, బొగ్గు లోడుతో అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందిన సంగతి విదితమే. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. చంద్రశేఖర్ గౌడ్‌ను ప్రత్యేక విచారణ అధికారిగా నియమించింది. ఇందులో భాగంగా బుధవారం ఆయన భూపాలపల్లి జిల్లాకు విచ్చేసి క్షేత్రస్థాయిలో విస్తృతమైన దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా చంద్రశేఖర్ గౌడ్ మొదట ఘనపూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, అక్కడ పోలీస్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రమాదం జరిగిన తీరు, ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ప్రాథమిక ఆధారాలు మరియు దర్యాప్తు పురోగతి వివరాలను ఘనపూర్ సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ అశోక్‌లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్, లారీ యజమాని (ఓనర్)తో పాటు సంఘటనా స్థలంలో ఉన్న హార్వెస్టర్ డ్రైవర్‌ను విడివిడిగా సుదీర్ఘంగా విచారించి వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.పోలీస్ స్టేషన్ విచారణ అనంతరం జెన్కో ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రమాద సమయానికి సదరు లారీలో తరలిస్తున్న బొగ్గు రవాణాకు సంబంధించిన పూర్తి వివరాలను, పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అధికారుల బృందంతో కలిసి ప్రమాదం జరిగిన ముఖ్య కూడలి (సంఘటనా స్థలానికి) చేరుకున్నారు.అక్కడ ప్రమాదాన్ని కళ్లారా చూసిన నలుగురు ప్రత్యక్ష సాక్షులను పిలిపించి మాట్లాడారు.ప్రమాదం ఎలా జరిగిందనే అంశంపై పూర్తి స్పష్టత కోసం నిపుణుల సమక్షంలో ‘సీన్ రీ-కన్స్ట్రక్షన్’ (ఘటనా స్థలాన్ని పునఃసృష్టి) చేయించి, లారీ వచ్చిన వేగం, బ్రేకులు వేసిన దూరం తదితర సాంకేతిక పరిస్థితులను క్షుణ్ణంగా విశ్లేషించారు.అలాగే ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను నిశితంగా పరిశీలించి కీలక ఆధారాలను సేకరించారు.ఆ తర్వాత బొగ్గు లోడింగ్ పాయింట్ అయిన తాడిచర్ల ఓపెన్ కాస్ట్ గనికి స్వయంగా వెళ్లి,అక్కడ ఓపెన్ కాస్ట్ ప్రతినిధులు, అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.ప్రమాద తీవ్రతకు దారితీసిన అంశాలను పరిశీలించేందుకు గాను,ఆ రోజు సదరు లారీలో లోడ్ చేసిన బొగ్గు బరువు,దానికి సంబంధించిన రికార్డులను కూలంకషంగా తనిఖీ చేశారు.ఈ ఉన్నత స్థాయి విచారణాధికారి చంద్రశేఖర్ గౌడ్ వెంట మోటారు వాహన తనిఖీ అధికారులు జంగ్లీ శ్రీనివాస్,శివపల్లి శ్రీనివాస్,బారగాడి శ్రీనివాస్, ఘనపూర్ సీఐ కరుణాకర్ రావు,ఎస్ఐ అశోక్, అలాగే భూపాలపల్లి అసిస్టెంట్ మోటారు వాహన తనిఖీ అధికారులు ఫాహిమా సుల్తానా, సుందర్ లాల్, శ్రీనివాస్ తదితర రవాణా, పోలీస్ శాఖల అధికారులు నిరంతరం పాల్గొన్నారు.కాగా, ఈ విచారణలో తేలిన కీలక అంశాలు, సేకరించిన సాంకేతిక ఆధారాలతో కూడిన ప్రాథమిక నివేదికను ఒకటి రెండు రోజుల్లో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్‌కు అధికారికంగా అందజేయనున్నట్లు విచారణ అధికారి చంద్రశేఖర్ గౌడ్ వెల్లడించారు. ఒక జిల్లా స్థాయి అధికారి మృతికి కారణమైన ఈ ప్రమాదం వెనుక ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో జరుగుతున్న ఈ సమగ్ర విచారణ జిల్లావ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.