పబ్లిక్ గార్డెన్స్ వద్ద తప్పిన పెను ప్రమాదం
నుజ్జునుజ్జయిన వాహనాలు

తెలుగు గళం హనుమకొండ సెప్టెంబర్ 15
హనుమకొండ పబ్లిక్ గార్డెన్స్ సమీపంలోని ప్రధాన కూడలి వద్ద మంగళవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. సిరిసిల్ల డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సు (టిఎస్ 23 టి 8923) విద్యుత్ వైర్లకు చుట్టుకోవడంతో సమీపంలోని భారీ వృక్షం ఒక్కసారిగా నేలకొరిగింది. ఈ ఘటనతో బస్సులోని ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు పబ్లిక్ గార్డెన్స్ వద్ద ఉన్న తీవ్రమైన మూలమలుపు వద్ద వేగంగా దూసుకొచ్చింది.ఈ క్రమంలో విద్యుత్ వైర్లు బస్సుకు చుట్టుకోవడంతో పక్కనే ఉన్న భారీ చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది.దీంతో చెట్టు ఒక్కసారిగా రహదారిపై కూలిపోయింది.నుజ్జునుజ్జయిన వాహనాలుచెట్టు కూలిన సమయంలో దాని కింద పార్క్ చేసి ఉన్న రెండు ద్విచక్ర వాహనాలు, మూడు ఆటోలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఆ సమయంలో వాహనాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రహదారిపై కూడా జనసంచారం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం జరగకుండా బయటపడింది.సమాచారం అందుకున్న వెంటనే కాజీపేట ట్రాఫిక్ సీఐ వెంకటరత్నం సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు.రహదారిపై, బస్సుపై పడిన చెట్టు కొమ్మలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.ప్రమాదానికి కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.ప్రాణనష్టం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.