భూపాలపల్లిలో టాస్క్ మెగా జాబ్‌మేళా ఘనంగా ప్రారంభం
ఎమ్మెల్యే గండ్ర సత్తన్న చొరవతో 142కు పైగా కంపెనీలు హాజరు
వేలాది మంది యువత భాగస్వామ్యం
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
యువత కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకున్నప్పుడే ఉన్నత వేతనాలతో కూడిన మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్లో శుక్రవారం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై వివిధ కంపెనీల స్టాళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చొరవతో ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాకు 142కు పైగా ప్రముఖ కంపెనీల ప్రతినిధులు తరలిరావడం అభినందనీయమన్నారు.ప్రారంభంలో తక్కువ వేతనం ఉన్నా అనుభవంతో రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఆర్జించే అవకాశాలు వస్తాయని,ప్రాంతీయ పరిమితులు పెట్టుకోకుండా ఎక్కడ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోవాలని యువతకు సూచించారు.పరిశ్రమల అవసరాలకు తగిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ, టాస్క్ ద్వారా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని,అలాగే ప్రైవేటు రంగంలోనూ ఉపాధి కల్పనకు జాబ్‌మేళాలు దోహదపడుతున్నాయని చెప్పారు.మేళా ప్రారంభమైన రెండు గంటల్లోనే 600 మందికి పైగా ప్రాథమికంగా ఎంపిక కావడం విశేషమన్నారు.అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో రోడ్ల విస్తరణతో పాటు రూ200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం,పారిశ్రామిక అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ.. ఈ మెగా జాబ్‌మేళా ద్వారా సుమారు 10 వేల నుంచి 12 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు.గత ఏడాది నిర్వహించిన మేళాలో 2,700 మందికి ఉద్యోగాలు లభించాయని గుర్తుచేశారు.సింగరేణి సంస్థ సహకారంతో ఏసీ వసతితో కూడిన శాశ్వత టాస్క్ శిక్షణ కేంద్రం, గాంధీనగర్ పారిశ్రామిక ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ..స్థానికంగానే ఇంటర్వ్యూలు నిర్వహించే సదుపాయాన్ని యువత అందిపుచ్చుకోవాలని కోరారు.అనంతరం ఎంపికైన అభ్యర్థులకు అతిథులు నియామక పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సంకీర్త్, టాస్క్ సీఈఓ ప్రదీప్ రెడ్డి,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి,రాష్ట్ర ఉపాధి హామీ పథకం డైరెక్టర్ దండు రమేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు,మున్సిపల్ చైర్పర్సన్ బుర్ర కొమరయ్య,వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్,మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
