అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టు రట్టు
నలుగురు నిందితుల అరెస్ట్.. ఇద్దరు పరార్”
తెలుగు రాష్ట్రాల్లో ఏడు చోట్ల చోరీలు: రూ. 11.50 లక్షల సొత్తు రికవరీ
పాత నేరస్థులపై ‘పీడీ యాక్ట్’ నమోదుకు సన్నాహాలు: కల్లూరు డీఎస్పీ వసుంధర యాదవ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుస దొంగతనాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర ‘యానాది దొంగల ముఠా’ గుట్టును ఖమ్మంజిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వి.యం. బంజర పోలీసులు రట్టు చేశారు. ముఠాలోని నలుగురు కీలక సభ్యులను అరెస్ట్ చేసి, వారి నుంచి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు డివిజన్ పోలీసు రక్షక శాఖాధికారి (డీఎస్పీ) శ్రీమతి వసుంధర యాదవ్ మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు.
తోటలో మాటు వేసి..
పోలీసుల కథనం ప్రకారం.. పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామ శివారులోని ఓ ఫాం ఆయిల్ తోటలో ముఠా సభ్యులు ఆశ్రయం పొందుతున్నట్లు వి.యం. బంజర ఉపనిరీక్షకుడికి (ఎస్సై) నమ్మదగిన సమాచారం అందింది. దీంతో సిబ్బందితో కలిసి వెళ్లిన పోలీసులు.. తోటలో కాపలాగా ఉన్న నలుగురు నిందితులను పట్టుకున్నారు. స్థానిక పంచాయతీదారుల (సాక్షుల) సమక్షంలో వారిని విచారించగా, ముఠాగా ఏర్పడి చేసిన వరుస దొంగతనాల వివరాలను అంగీకరించారు.అరెస్టయిన వారిలో పెనుబల్లి మండలం లంకపల్లికి చెందిన మాణీకల వసంతరావు(39), మానికల రమేష్(33)లతో పాటు ఏలూరు జిల్లా చాట్రాయి మండలం తుమ్ముగూడెం గ్రామానికి చెందిన పొన్నూరి కోటేశ్వరరావు(24), తుమ్మల శేఖర్(25) ఉన్నారు. కాగా, ఈ ముఠాలోని మరికొందరు నిందితులు పొన్నూరి రాంబాబు, మానికల సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు.
పక్కా స్కెచ్‌తో అర్ధరాత్రి దోపిడీలు
ఈ ముఠా సభ్యులు పగటిపూట ఆటోల్లో తిరుగుతూ తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించేవారు. రాత్రి వరకు సమీపంలోని పొలాల్లో మాటు వేసి, అర్ధరాత్రి దాటిన తర్వాత గడ్డపారలతో తలుపులు, ఇనుప బీరువాల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడేవారు. ఒకరు బయట నిఘా ఉంచగా, మిగిలిన వారు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి, నగదు దోచుకెళ్లేవారని విచారణలో తేలింది. ఏడు నేరాలు వివరణ రూ.11.50 లక్షల సొత్తు నిందితులపై ఖమ్మం, ఏలూరు జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు చూస్తే
లంకపల్లిలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) నిబంధనల ప్రకారం నమోదైన కేసులో.. రూ.3.70 లక్షల విలువైన 108 గ్రాముల బంగారం, 900 గ్రాముల వెండి, రూ.20,000 నగదు చోరీ చేశారు.
పెనుబల్లి మండల పరిధిలోని అడవిమల్లెల,వి.యం. బంజర గ్రామాలలో రూ.1.80 లక్షల విలువైన 45 గ్రాముల బంగారం, రూ.5,000 విలువైన వెండి, రూ.3.70 లక్షల నగదు (మొత్తం రూ.5.55 లక్షలు) దోచుకెళ్లారు.
వేంసూరు మండల పరిధిలోని దుద్దెపూడి గ్రామంలో రూ.65,000 విలువైన 20 గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి చోరీ.
వేంసూరు మండల పరిధిలోని కందుకూరు గ్రామంలో రెండు ఇళ్లపై దాడి చేసి ఒకచోట 20 గ్రాముల బంగారం, ఒక కిలో వెండి చోరీ చేయగా, మరో ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించి విఫలమయ్యారు.
చిన్నంపేట (చాట్రాయి, ఏపీ): తాళం వేసిన ఇంట్లో చొరబడి రూ.80,000 విలువైన బంగారు ఆభరణాలు, రూ.20,000 నగదు అపహరించారు.
సత్తుపల్లి పట్టణంలో ఒక దేవాలయంలో చొరబడి రూ.5,000 విలువైన కానుకల హుండీని ఎత్తుకెళ్లారు.
ప్రవర్తన మారలేదు.. పీడీ యాక్ట్ నమోదు!
నిందితులంతా పాత నేరస్థులని, వీరిపై ఇప్పటికే వి.యం. బంజర పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ (నిఘా పట్టిక) ఉన్నప్పటికీ ప్రవర్తనలో మార్పు రాలేదని డీఎస్పీ తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం సత్తుపల్లి న్యాయస్థానానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ముఠాపై కొత్త చట్టాల ప్రకారం ‘వ్యవస్థీకృత నేరాల’ నిబంధనల కింద కేసు నమోదు చేయడంతో పాటు, పీడీ యాక్ట్ (నిర్బంధ చట్టం) నమోదుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తప్పించుకున్న మిగిలిన ఇద్దరు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు ముమ్మరం చేశామన్నారు.
Good coverage medam garu.