“ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” – ప్రశ్నించిన పేరెంట్స్ కమిటీకి మెస్ సిబ్బంది బెదిరింపు ధోరణి!

విద్యార్థుల ఆరోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా? మల్లంపల్లి గురుకులంపై ఉన్నతాధికారులు వెంటనే కొరడా ఝళిపించాలి!

ఈ69న్యూస్ – తెలుగు గళం మల్లంపల్లి (ములుగు), సెప్టెంబర్ 15:

మల్లంపల్లిలోని ఏటూరునాగారం తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల (బాలుర)లో విద్యార్థులకు నాణ్యత లేని, కుళ్లిపోయిన కూరగాయలతో భోజనం వండుతున్నారంటూ పేరెంట్స్ కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కమిటీ ఆరోపించింది. మంగళవారం పేరెంట్స్ కమిటీ చైర్మన్ అర్షం రాజ్‌కుమార్ పాఠశాలలోని వంటగది, భోజనశాలను ఆకస్మికంగా తనిఖీ చేయగా కుళ్లిపోయిన క్యాబేజీ, చిక్కుడుకాయలు, టమాటాలు కనిపించాయని తెలిపారు. పనికిరాని కూరగాయలను విద్యార్థుల చేతే శుభ్రం చేయిస్తూ, వాటినే వంటకు వినియోగిస్తున్న పరిస్థితి కనిపించిందని ఆరోపించారు. ఇది విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రశ్నించిన పేరెంట్స్ కమిటీ చైర్మన్‌తో మెస్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ దురుసుగా వ్యవహరించారని, తనిఖీ చేసే అధికారం మీకెవరిచ్చారంటూ ప్రశ్నించారని కమిటీ ఆరోపించింది. విద్యార్థుల భోజనం, ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రుల ప్రతినిధులు ప్రశ్నించడం సహజమైన బాధ్యత అయినప్పటికీ, వారితో అనుచితంగా మాట్లాడటం సరికాదని పేర్కొంది. అదేవిధంగా, సమస్యను పరిష్కరించాల్సిన ప్రిన్సిపాల్ కూడా మెస్ ఇన్‌ఛార్జ్‌కు మద్దతుగా మాట్లాడుతూ పేరెంట్స్ కమిటీని ప్రశ్నించడం మరింత ఆందోళన కలిగించిందని కమిటీ తెలిపింది. పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు కూడా సక్రమంగా లేవని ఆరోపించింది. పేద, గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుతున్న గురుకుల పాఠశాలలో ఇలాంటి నిర్లక్ష్యాన్ని ఎంతమాత్రం సహించరాదని పేరెంట్స్ కమిటీ స్పష్టం చేసింది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందుతున్నదా లేదా అనే అంశంపై ఉన్నతాధికారులు తక్షణమే ఆకస్మిక తనిఖీ నిర్వహించి వాస్తవాలను నిర్ధారించాలని కోరింది. జోనల్ అధికారి (జెడ్‌ఓ), ములుగు జిల్లా సంక్షేమ అధికారి (డీసీఓ) వెంటనే స్పందించి పాఠశాలను తనిఖీ చేసి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని పేరెంట్స్ కమిటీ డిమాండ్ చేసింది. ఆరోపణలు నిజమని తేలితే మెస్ ఇన్‌ఛార్జ్, ప్రిన్సిపాల్‌పై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సస్పెండ్ చేయాలని కోరింది. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన అంశంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే తల్లిదండ్రులు, విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేరెంట్స్ కమిటీ హెచ్చరించింది.

ఉన్నతాధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు సురక్షితమైన ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, సరైన మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేసింది.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *