నిందితుడిపై పీడీ యాక్ట్‌.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

ఖమ్మం, సెప్టెంబర్‌ 15 (ఈ69న్యూస్)

మహిళలను వ్యభిచారంలోకి దింపుతూ ఆర్థికంగా లాభాలు పొందుతున్న వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్‌ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారు. ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామానికి చెందిన బత్తుల బాలకృష్ణ (30) జిల్లాలో వ్యభిచార గృహాలను నిర్వహిస్తూ మహిళలను ఈ దందాలోకి తీసుకువస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్‌ తెలిపారు.

బాలకృష్ణపై ఖమ్మం టూ టౌన్‌, త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో అనైతిక రవాణా, వ్యభిచార నిరోధక చట్టం కింద కేసులు నమోదైనట్లు కమిషనర్‌ వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 6న విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం గాంధీచౌక్‌లోని ఓ లాడ్జిపై పోలీసులు దాడి చేయగా వ్యభిచార కార్యకలాపాల కోసం లాడ్జి గదిని అధిక మొత్తంలో డబ్బు చెల్లించి తీసుకున్నట్లు గుర్తించారు.

ఈ వ్యవహారంలో బాలకృష్ణతో పాటు మెరెడ్డి సత్యవతి, లాడ్జి మేనేజర్‌ అలకుంట్ల శ్రీకాంత్‌ కలిసి కుట్రపూరితంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కాకినాడకు చెందిన ఓ మహిళ ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఆమెను వ్యభిచారంలోకి తీసుకువచ్చి ఖమ్మంకు తరలించినట్లు వెల్లడించారు. అనంతరం లాడ్జి గదిలో ఉంచి కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

నిందితుడి నేరప్రవృత్తిని అరికట్టడంతో పాటు శాంతిభద్రతలను పరిరక్షించేందుకు ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం–1986 (పీడీ యాక్ట్‌) సెక్షన్‌ 3(2) కింద బాలకృష్ణపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. అనంతరం నిందితుడిని చంచల్‌గూడ సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు వెల్లడించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *