పట్టణాల నుంచి పల్లెలు, తండాల వరకు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్స్‌లపై చర్యలెప్పుడు?

మహబూబాబాద్ ఘటనతో మరింత చర్చనీయాంశంగా మారిన బెల్టు షాపుల వ్యవహారం

ఒకచోట దాడులు..మరోచోట మౌనం ఎందుకు?

ఈ69 న్యూస్ బ్యూరో రిపోర్టర్ సెప్టెంబర్ 15

రాష్ట్రంలో బెల్టు షాపుల వ్యవహారం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతోంది. పట్టణాలు, పట్టణ శివార్లు, గ్రామాలు, పల్లెలు, తండాలు అనే తేడా లేకుండా అనేక ప్రాంతాల్లో బెల్టు షాపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఎక్సైజ్ అధికారులు బెల్టు షాపులపై దాడులు నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులు బహిరంగంగానే కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బెల్టు షాపులకు అనుమతి ఉందా-లేదా?

ప్రజల్లో ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఇదే.బెల్టు షాపులకు అనుమతి లేదంటే రాష్ట్రవ్యాప్తంగా అవి ఎలా కొనసాగుతున్నాయి? తమ పరిధిలో బెల్టు షాపులు నడుస్తున్న విషయం తెలిసినా వాటిని పూర్తిస్థాయిలో అరికట్టడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు? చర్యలు తీసుకోని అధికారుల బాధ్యతను ప్రభుత్వం ఎందుకు నిర్ణయించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఒకవేళ బెల్టు షాపుల నిర్వహణకు ఏదైనా నిబంధనల ప్రకారం అనుమతి ఉంటే, ఆ అనుమతుల విధానం ఏమిటి? ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయి? అనే అంశాలను ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలి.అనుమతి లేని విక్రయాలపై దాడులు చేస్తుంటే, ఒక ప్రాంతంలో కఠిన చర్యలు..మరో ప్రాంతంలో మౌనం ఎందుకు అనే సందేహాలకు కూడా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

మహబూబాబాద్ జిల్లా ఘటనతో కలకలం

బెల్టు షాపుల వ్యవహారంపై చర్చ జరుగుతున్న సమయంలో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. నర్సింహులపేటలోని మధుర వైన్స్ ఎదుట బెల్టు షాప్ నిర్వాహకులుగా పేర్కొంటున్న యాకయ్య, స్వాతి దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చర్చనీయాంశంగా మారింది.తమ బెల్టు షాపుపై అబ్కారీ అధికారులు దాడి చేసి సుమారు రూ.40 వేల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారని వారు ఆరోపించినట్లు సమాచారం. వైన్స్ షాపు నుంచే మద్యం కొనుగోలు చేసి విక్రయిస్తున్నామని వారు పేర్కొంటూ తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలుస్తోంది.అయితే ఈ ఘటనకు సంబంధించిన ఆరోపణలు, మద్యం సరఫరా వ్యవహారం, వైన్స్ షాపు పాత్ర తదితర అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను అధికారులు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఘటన వెనుక అసలు కారణాలు ఏమిటి? మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? సరఫరా నిబంధనలకు అనుగుణంగానే జరిగిందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

బెల్ట్ షాపులకు మద్యం ఎక్కడి నుంచి వస్తోంది?

బెల్టు షాపులపై చర్యల విషయంలో అసలు కీలకమైన అంశం మద్యం సరఫరా. బెల్టు షాపుల్లో పట్టుబడుతున్న మద్యం ఎక్కడి నుంచి వస్తోంది? వైన్స్ షాపుల నుంచే మద్యం కొనుగోలు చేసి బెల్టు షాపుల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నప్పుడు, ఆ సరఫరా గొలుసుపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.బెల్టు షాపులో మద్యం పట్టుబడిన ప్రతిసారీ కేవలం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయడం కాకుండా, ఆ మద్యం ఏ దుకాణం నుంచి వచ్చింది? ఎవరు విక్రయించారు? నిబంధనలకు విరుద్ధంగా సరఫరా జరిగిందా? అనే అంశాలను కూడా దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేసినట్లు నిర్ధారణ అయితే సంబంధిత వైన్స్ షాపులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మద్యం సరఫరా మూలాన్ని కట్టడి చేస్తే బెల్టు షాపుల దందాను కూడా చాలావరకు అరికట్టవచ్చని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అధికారులపై కూడా బాధ్యత ఉండాలి

బెల్టు షాపులపై దాడులు చేయడం అధికారుల విధుల్లో ఒక భాగమే అయినప్పటికీ, తమ పరిధిలో నిరంతరం అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నా వాటిని గుర్తించకపోవడం లేదా పట్టించుకోకపోవడంపై కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.ఒకచోట దాడులు చేసి కేసులు నమోదు చేస్తూ, మరోచోట బెల్టు షాపులు కొనసాగుతున్నా చర్యలు తీసుకోకపోతే ప్రజల్లో అనుమానాలు కలగడం సహజమే.అందుకే జిల్లాల వారీగా బెల్టు షాపులపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు, మద్యం సరఫరా మూలాలను కూడా గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు.

చర్యలు ఎవరిపై?

బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడం అవసరమే. అయితే అంతటితో వ్యవహారం ముగియకూడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.బెల్టు షాపులకు నిబంధనలకు విరుద్ధంగా మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ షాపులపై చర్యలు తీసుకుంటారా? అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారుల బాధ్యతను ఎలా నిర్ణయిస్తారు? బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న అసలు మూలాలను ఎందుకు బయటకు తీయడం లేదు? ఒకచోట కఠిన చర్యలు..మరోచోట మౌనం ఎందుకు? ఇలాంటి ప్రశ్నలకు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిందే!

రాష్ట్రంలో బెల్టు షాపులకు అనుమతి ఉందా? లేదా? అన్న విషయాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించాలి. అనుమతి లేకుంటే వాటిని పూర్తిగా అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించాలి. బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వైన్స్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ప్రజలకు తెలియజేయాలి. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలిన అధికారులపై కూడా బాధ్యత నిర్ణయించాలి.బెల్టు షాపుల దందాను నిజంగా అరికట్టాలంటే చివరి దశలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై మాత్రమే చర్యలు తీసుకోవడం సరిపోదు.మద్యం సరఫరా చేసే మూలాన్ని గుర్తించాలి..అక్రమ సరఫరాను కట్టడి చేయాలి..వైన్స్ షాపుల పాత్రపై విచారణ జరపాలి.. అధికారుల బాధ్యతను కూడా పరిశీలించాలి.బెల్టు షాపులకు అనుమతి ఉందా లేదా? అనుమతి లేకుంటే అవి ఎలా కొనసాగుతున్నాయి? ఒకచోట దాడులు..మరోచోట మౌనం ఎందుకు? మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట ఘటనలో వచ్చిన ఆరోపణల వెనుక వాస్తవాలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిందే.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *