వర్ధన్నపేట అంబేద్కర్ నగర్‌లో భూ ఆక్రమణ ఆరోపణలు
తక్షణ చర్యలు తీసుకోవాలని టీడీపీ ఇంచార్జి చాడ మరియా సురేఖ డిమాండ్
•రెవెన్యూ, పోలీసు అధికారులు నిష్పక్షపాత విచారణ చేయాలని విజ్ఞప్తి
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట శివారు అంబేద్కర్ నగర్ గ్రామంలో తన వ్యవసాయ భూమిని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీడీపీ వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జి చాడ మరియా సురేఖ ఆరోపించారు.
తన స్వంత పట్టా వ్యవసాయ భూమిని ఎన్నో సంవత్సరాలుగా ప్రశాంతంగా సాగు చేసుకుంటున్నానని ఆమె తెలిపారు. అయితే ఇటీవల అధికార పార్టీకి చెందిన కొందరు స్థానిక నాయకులు తమ రాజకీయ,అధికార బలం ఉపయోగించి భూమిని అక్రమంగా ఆక్రమించే ప్రయత్నం చేయడంతో పాటు తనపై గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు.ఈ విషయంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులు మరియు పోలీసు శాఖ వెంటనే స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఆమె కోరారు. రెవెన్యూ అధికారులు సంబంధిత భూమికి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి,రికార్డులు పరిశీలించి, భూమి ఎవరి ఆధీనంలో ఉందో స్పష్టంగా నిర్ధారించి చట్టప్రకారం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
అక్రమ ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, తన ప్రాణ, ఆస్తులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సంబంధిత అధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని చెప్పారు.కాగా,ఈ ఆరోపణలపై సంబంధిత నాయకులు, రెవెన్యూ అధికారుల వివరణ తెలియాల్సి ఉంది. అని అన్నారు.