

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి కొత్తపల్లిగోరి
ఇందిరమ్మ ఇండ్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందవద్దని అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే భాద్యత నాది అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలోని కొత్తపల్లిగోరి మండలం చిన్నకోడెపాక గ్రామ రైతు వేదికలో జిల్లా హౌసింగ్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులకు మంజూరీ పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా చిన్నకోడెపాక, బాలయ్యపల్లి, విజ్జయ్యపల్లి, రాజక్కపల్లి, గాంధీనగర్, కొత్తపల్లి(కే), వెంకటేశ్వర్లపల్లి, చెంచుపల్లి గ్రామాల్లోని మొత్తం 79 మంది లబ్దిదారులకు మంజూరీ పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత ప్రభుత్వ పదేళ్ళ పాలనలో స్మశాన వాటికలు, వైకుంఠదామాలు కడితే ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ళలోనే కూలిపోయిందని ఎమ్మెల్యే విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా పాలన కొనసాగుతుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు, గృహజ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. అర్హులందరికీ విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే చెప్పారు. అదేవిధంగా, రాష్ట్రాన్ని గత పదేళ్లు పాలించినోళ్లు ఒక్క రేషన్ కార్డూ ఇవ్వకపోగా, పేదలను నిరుపేదలుగా మార్చిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కుతుందని ఎమ్మెల్యే ఆరోపించారు. పేదలకు కూడా సన్నబియ్యం అందించాలన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడాలేని విధంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినట్లు ఎమ్మెల్యే వివరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పేదలకు ఒక్క రేషన్ కార్డు కాని, ఒక్క కిలో సన్న బియ్యం కాని ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.