
ఈ69 న్యూస్ వరంగల్/వర్ధన్నపేట ఆగస్ట్ 06
ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వయోజన సమితి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10న రాయపర్తి మండలంలోని కాట్రపల్లి గ్రామంలో నిర్వహించనున్న ఉమ్మడి జిల్లా వార్షిక సమావేశానికి వర్ధన్నపేట ఏసీపీ ఎ.నర్సయ్య,సీఐ కె.శ్రీనివాసరావులను ఆహ్వానించే నిమిత్తం అహ్మదీయ జిల్లా ప్రతినిధులు వారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కమ్యూనిటీ ప్రతినిధులు పోలీసు అధికారులకు తమ సంస్థ యొక్క లక్ష్యాలు,కార్యకలాపాల గురించి సంక్షిప్తంగా వివరణ ఇచ్చారు.‘‘ప్రేమ అందరితో-ద్వేషం ఎవ్వరితో లేదు”అనే నినాదంతో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా మానవతా సేవలతోపాటు శాంతి ప్రతిష్ఠకు పాటుపడుతున్నదని తెలిపారు.అనంతరం వరల్డ్ క్రైసిస్ అండ్ పాత్వే టు పీస్ అనే గ్రంథాన్ని వారికి బహూకరించి,సమాలోచనలు జరిపారు.ఈ సందర్భంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ యాకూబ్ పాషా,వయోజన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ముహమ్మద్ సలీం మాట్లాడుతూ…ప్రపంచంలోని 220 పైచిలుకు దేశాల్లో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ తన మత సేవలతో పాటు సామాజిక,శాంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదనీ,‘‘మానవ సేవే మాధవ సేవ’’అనే ధ్యేయంతో అన్ని మతాలను గౌరవిస్తూ కార్యకలాపాలు సాగిస్తున్నదనీ తెలిపారు.ఆగస్టు 10న కాట్రపల్లి గ్రామంలో జరిగే వయోజనుల వార్షిక సమావేశంలో జిల్లావ్యాప్తంగా ఉన్న అహ్మదీయ వయోజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సర్కిల్ ఇంచార్జి ఆసిఫ్ ఖాదిం కాట్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు ముహమ్మద్ నాసిర్ పాల్గొన్నారు.