
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్లు గ్రామ పరిధిలోని ఆకేరు వాగులో జేసీబీ యంత్రాలతో మట్టి తవ్వకాలు జరుగుతున్న ఘటన స్థానికుల్లో ఆందోళనకు కారణమైంది.వాగు మధ్యభాగం మరియు తీర ప్రాంతాల్లో జేసీబీతో మట్టిని తవ్వి ట్రాక్టర్లలో లోడ్ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.ఈ తవ్వకాల వల్ల వాగు సహజ ప్రవాహం దెబ్బతినే ప్రమాదం ఉందని, ముఖ్యంగా వర్షాకాలంలో నీటి ప్రవాహం మారిపోవడం వల్ల సమీపంలోని వ్యవసాయ భూములకు నష్టం కలగవచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మట్టి తవ్వకాలకు అధికారిక అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదని స్థానికులు పేర్కొన్నారు.ఈ ఘటనపై 69 న్యూస్ లో వార్త ప్రచురితమైన వెంటనే అధికారులు స్పందించారు.జఫర్గడ్ తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) దేవేందర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే అధికారులు వస్తున్నారని సమాచారం తెలుసుకున్న అక్రమ తవ్వకాలలో పాల్గొన్న జేసీబీ మరియు ట్రాక్టర్ డ్రైవర్లు అక్కడి నుంచి పరారైనట్లు తెలిసింది.ఈ ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తున్నామని, అక్రమ మట్టి తవ్వకాలపై తగిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు.వాగు సహజ స్వరూపాన్ని కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.