చర్చా గోష్టిలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు
— చర్చా గోష్టిలో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు
ఆర్.టి.ఐ చట్టం అమలు తీరు - పొంచి ఉన్న ప్రమాదాలు" అనే అంశంపై హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (HCF), పీపుల్స్ ఫ్రంట్ ఫర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (PFRI) సంయుక్తంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం హాల్లో నిర్వహించిన చర్చా గోష్టిలో కేంద్ర సమాచార మాజీ కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు మాట్లాడుతూ... ఆర్.టి.ఐ చట్టం చాలా విశిష్టత కలిగినదని, దానిని సక్రమంగా వినియోగించాలని, పిచ్చి పిచ్చి ప్రశ్నలతో అధికారులను వేధించటం కొరకు కాక సమాజానికి, ప్రజానీకానికి ఉపయోగపడే సమాచారాన్ని రాబట్టేలా ప్రశ్నలను అడగాలని సూచించారు. కొంతమంది అధికారులు ప్రశ్న రూపంలో అడిగితే సమాచారం ఇవ్వటం లేదని, సమాచారం రాబట్టటం ప్రధానం తప్ప ఏ రూపంలో అడిగారు అనేది ప్రధానం కాదని అలాంటి వారికి ప్రశ్న రూపంలో కాకుండా కావలసిన సమాచారాన్ని రాబట్టే పద్ధతిలో అడిగి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. ప్రపంచంలోనే అతి గొప్ప సమాచార హక్కు చట్టం మనదేశంలో ఉన్నదని, అందుకు మనమంతా గర్వించదగిన విషయమని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై, మనందరిపై ఉన్నదని ఉద్భోదించారు.
చర్చా గోష్టిలో పాల్గొన్న మరో ముఖ్య అతిథి ఆర్టీఐ నిపుణులు శ్రీనివాస మాధవ్ ఆర్టీఐ కార్యకర్తలు అడిగిన అనేక ప్రశ్నలకు చట్టాలను ఉదహరిస్తూ సమాధానాలు ఇచ్చారు. సమాచార హక్కు చట్టాన్ని నీరుగార్చ్చేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు సమాచారాన్ని ఇవ్వకుండా తప్పించుకునేందుకు అనేక వక్రమార్గాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. సమాచారం పొందటం ప్రజల హక్కుని, దాన్ని తిరస్కరించకుండా సమాచార హక్కు చట్టం రక్షణ కల్పిస్తున్నదని దానిని సక్రమమైన పద్ధతిలో వినియోగించుకోవాలని ఆర్టీఐ కార్యకర్తలకు సూచించారు. గతంలో ఒక ఉన్నతాధికారి తనకు చెప్పకుండా ఆర్టీఐ సమాచారం ఇవ్వవద్దని సర్కులర్ జారీ చేశాడని, దానిపై ఒక ఆర్టీఐ కార్యకర్త లా స్టూడెంట్ హైకోర్టులో పిటిషన్ వేయగా హైకోర్టు సదరు అధికారికి అక్షంతలు వేసిందని వెంటనే తను ఇచ్చిన సర్కులర్ ను వెనక్కి తీసుకున్నాడని, అది సమాచార హక్కు చట్టం పవర్ అని సోదాహరణ గా వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమాచారాన్ని పొందేందుకు ఆర్టీఐ కార్యకర్తలు చాలా శ్రమించాల్సి వస్తున్నదని అయినా అనేకమంది కార్యకర్తలు పట్టు వదలకుండా కృషిచేసి సమాచారాన్ని రాబట్టుకుంటున్నారని అభినందించారు. దురదృష్టవశాత్తు ఇతర రాష్ట్రాల కన్నా తెలుగు రాష్ట్రాలలో ఆర్టీఐ చట్ట వినియోగం, సమాచారాన్ని ఇస్తున్న తీరు లోపభూఇష్టంగా ఉన్నదని, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సమాచార హక్కును కాపాడాలని సూచించారు.
ఆర్టీఐ యాక్టివిస్ట్ ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవడం ద్వారా తాను సమాచారాన్ని సేకరించి, కొంతమంది అవినీతి అధికారుల బండారాన్ని బయటపెట్టిన తీరును వివరించారు. సమాచారాన్ని ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం అధికారులు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారని వాటిని దృష్టిలో పెట్టుకొని మనం కూడా సమాచారాన్ని రాబట్టుకునేందుకు పట్టువదలకుండా కృషిచేసి, ఇవ్వని అధికారులపై చర్య తీసుకునేలా పోరాడాలని సూచించారు.
ఆలిండియా లాయర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె. పార్థసారథి మాట్లాడుతూ పీపుల్స్ ఫ్రంటు ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ (పి.ఎఫ్.ఆర్.ఐ) ఆధ్వర్యంలో ఆర్టీఐ చట్టాన్ని అమలుకు జరుగుతున్న కృషిని వివరించారు. ఈరోజు సమాచార హక్కు చట్టం ప్రమాదంలో ఉన్నదని, దానిని కాపాడుకోవటం కోసం హెచ్.సి.ఎఫ్, పి.ఎఫ్.ఆర్.ఐ లాంటి ప్రజా సంఘాలు, సంస్థలు కృషి చేయాలని, వీరందరినీ కలిపి సమాచార హక్కు చట్ట రక్షణ కోసం తమ వంతు పోరాటాన్ని చేస్తామని తెలియజేశారు.
ఈ చర్చా గోష్టి కి హెచ్.సి.ఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య, పి.ఎఫ్.ఆర్.ఐ అధ్యక్షులు యాదయ్య అధ్యక్షత వహించారు. అనేక మంది ఆర్టిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. సమాచార సేకరణలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆర్టిఐ కార్యకర్తలు తెలియజేశారు. ప్రశ్నలు - నిపుణుల సమాధానాలు రూపంలో చర్చా గోష్టి సుమారు మూడు గంటల పాటు సాగింది. అనేక విషయాలపై సందేహ నివృత్తి చేసేలా చర్చ గోష్టి సాగింది. HCF అధ్యక్షులు ఎం శ్రీనివాసరావు, నాయకులు పి.శ్రీనివాసరావు, సంగీత, రాజమౌళి, అస్మిత, లలిత, శ్వేత, సైదులు, గోపాల్, సుకుమార్, రమేష్, శంకరయ్య మరియు అనేక సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ చర్చాగోష్టిలో పాల్గొన్నారు.