
E69 న్యూస్ జనగామ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న నుండి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అందజేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదివారం ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా జనగామ నియోజకవర్గంలోని సాయి రామ్ ఫంక్షన్ హాల్ లో మధ్యాహ్నం 3 గంటలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అర్హులకు ఇళ్ల మంజూరు ఉత్తర్వులు అందజేయనున్నారని తెలిపారు.ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని సిరిపురం గార్డెన్స్ లో సాయంత్రం 4 గంటలకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తారని చెప్పారు.పాలకుర్తి నియోజకవర్గంలోని దశరథ్ గార్డెన్స్ లో మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి అర్హులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారని వెల్లడించారు.సోమవారం ఉదయం రాష్ట్ర అవతరణ వేడుకల్లో చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా 30 మంది లబ్ధిదారులకు,మధ్యాహ్నం ఎంపీ చేతుల మీదుగా జనగామ జిల్లాకు చెందిన వివిధ మండలాల 100 మంది లబ్ధిదారులకు ఈ పత్రాలు అందించనున్నట్లు వివరించారు.ఘనపూర్ మున్సిపాలిటీ,రూరల్ ప్రాంతాలకు 450 మందికి, పాలకుర్తి నియోజకవర్గానికి 150 మందికి గౌరవ స్థానిక శాసనసభ్యుల ద్వారా ఈ పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు.సోమవారం నుండి అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు.