ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల పరిశీలన
తాడిచెర్ల గ్రామంలో బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గ్రామపంచాయతీ మూడో విడత ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ మల్హర్రావు మండలం తాడిచెర్ల గ్రామపంచాయతీని సందర్శించి, అక్కడి పోలింగ్ సరళి, బందోబస్తు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు.ఎన్నికలు పూర్తిగా శాంతియుతంగా, పారదర్శకంగా జరిగేలా తీసుకుంటున్న భద్రతా చర్యలపై అధికారులతో ఆయన వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు లోనుకాకుండా స్వేచ్ఛగా, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఎన్నికల సందర్భంగా ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఓటర్ల భద్రతే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు.అలాగే, విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా కొనసాగించాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధురాలితో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆప్యాయంగా మాట్లాడి ఆమె అనుభవాలను తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను గుర్తుచేస్తూ, వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.మొత్తానికి, జిల్లా ఎస్పీ స్వయంగా పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించడం వల్ల ఓటర్లలో విశ్వాసం పెరిగిందని,గ్రామపంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా సజావుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు