` హేమలత, సిఐటియు జాతీయ అధ్యక్షులు
` హేమలత, సిఐటియు జాతీయ అధ్యక్షులు
కేంద్ర బిజెపి ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే కార్మికవర్గాన్ని బలిచ్చేందుకే 4 లేబర్ కోడ్స్ తీసుకవచ్చిందని, వాటి రద్దు కోసం 2025 జూలై 9న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను తెలంగాణ రాష్ట్రంలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు అఖిల భారత అధ్యక్షులు డా॥ కె.హేలమత పిలుపునిచ్చారు. ఈ రోజు (26.06.25) సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ లేబర్ కోడ్స్ అమలుకు వ్యతిరేకంగా 2025 మే 20 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మికవర్గం సన్నద్ధమవుతున్న సందర్భంలో పహల్గామ్లో ఉగ్రవాదుల దాడులు జరిగాయని. భారత్, పాకిస్తాన్ రెండు పొరుగు దేశాల మధ్య వైమానిక దాడులు వల్ల ఉద్రిక్తతలు పెరగడంతో మే 20న జరగాల్సిన సార్వత్రిక సమ్మెను 2025 జూలై 9కి వాయిదా వేయాల్సి వచ్చిందని, కానీ బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ పరిస్థితుల్లో కూడా అత్యంత దారుణంగా లేబర్ కోడ్ల అమలును ముందుకు తీసుకెళ్తున్నది. దేశమంతటా పూర్తిస్థాయిలో లేబర్ కోడ్లు అమల్లోకి రాకముందే జమ్మూ`కాశ్మీర్లో 420 యూనియన్ల రిజిస్ట్రేషన్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా రద్దు చేసిందన్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను అమలు చేస్తామని బాహాటంగా ప్రకటించి అమలుకు పూనుకున్నదని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మంత్రివర్గ సమావేశంలో 8 గంటల పని దినాన్ని 10 గంటల పని దినంగా మార్చిందన్నారు. రాత్రి షిఫ్ట్‌లలో మహిళలు పనిచెయ్యాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో 4 లేబర్ కోడ్ల సాకుతో కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్‌ను కఠినతరం చేయడం, కార్మిక సంఘాలను రద్దు చేసేందుకు బరితెగిస్తుందన్నారు. కార్మిక శాఖను పూర్తిగా ఫెసిలిటేట్ (మధ్యవర్తిత్వ శాఖ) విభాగంగా మార్చడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేయడం, కార్మిక చట్టాలను సరళతరం చేయడం, కార్మిక సంఘాలు లేని భారత దేశాన్ని పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులకు బహుమానంగా ఇవ్వడం కేంద్ర బిజెపి ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశ్యంగా వ్యవహరిస్తుందన్నారు.
దశాబ్ధాల పాటు కార్మికవర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను, హక్కులను, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉన్నదని, ప్రజల ఆస్తులను కార్పొరేట్లకు దోచిపెడ్తూ, మతోన్మాద చర్యల ద్వారా కార్మికవర్గ ఐక్యతకు విచ్ఛిన్నం చేసే చర్యలకు ప్రతిఘంటించేందుకు 2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్రంలోని అన్ని రంగాల కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు.
ఈ సమావేశంలో సిఐటియు జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, ఎస్.వీరయ్య, భూపాల్, జె.వెంకటేష్, ఎస్.రమ, పి.జయలక్ష్మీ, వంగూరు రాములు, ఎం.పద్మశ్రీ, ఎస్ రావు, ఎ.ముత్యంరావ్, రాగుల రమేష్, కళ్యాణం వెంకటేశ్వర రావు, టి.వీరారెడ్డి, టి.రాజారెడ్డి, బి.మల్లేష్, కూరపాటి రమేష్, పి.శ్రీకాంత్, కాసు మాధవి, కె.గోపాలస్వామి, ఎ.జె.రమేష్, ఎం.వెంకటేష్, బి.మధు, జె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.