గొల్ల బుద్ధారంలో టీఆర్పీ ఘన విజయం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ మండలం గొల్ల బుద్ధారం గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) మద్దతుతో పోటీ చేసిన సుంకరి కిరణ్ గ్రామ సర్పంచ్‌గా భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ గొల్ల బుద్ధారం గ్రామాన్ని సందర్శించి,నూతనంగా గెలుపొందిన సర్పంచ్ సుంకరి కిరణ్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి, హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ,గొల్ల బుద్ధారం గ్రామం జనరల్ రిజర్వేషన్ స్థానంలో బీసీలు, ఎస్సీలు ఐక్యంగా నిలబడి బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లడం అభినందనీయమైన విషయం అని పేర్కొన్నారు. డబ్బులు, మద్యం లాంటి ప్రలోభాలకు తావివ్వకుండా,క్లీన్ పాలిటిక్స్ ద్వారా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవడం గ్రామ ప్రజల రాజకీయ చైతన్యానికి నిదర్శనమని అన్నారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ స్వచ్ఛమైన రాజకీయాలకు మద్దతు ఇచ్చిన గొల్ల బుద్ధారం గ్రామ ప్రజలకు రవి పటేల్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ విజయం తెలంగాణ రాజ్యాధికార పార్టీ విధానాలపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనమని అన్నారు.భవిష్యత్తులో గొల్ల బుద్ధారం గ్రామ అభివృద్ధికి సర్పంచ్ సుంకరి కిరణ్ నిరంతరం కృషి చేసి, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు కోసం పార్టీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.