గ్రామపంచాయతీ కార్మికులపై వేధింపులు ఆపాలి
అక్రమ తొలగింపులను నిలిపివేయాలి
గ్రామపంచాయతీ ఎంప్లాయిస్,వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు జిల్లాలో పలుచోట్ల నూతనంగా ఎన్నికైన సర్పంచులు గ్రామపంచాయతీ కార్మికులను కక్షపూరితంగా వేధింపులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాపర్తి రాజు ఆందోళన వ్యక్తం చేశారు.గ్రామపంచాయతీ కార్మికులను అక్రమంగా తొలగించకుండా జిల్లా కలెక్టర్,డీపీఓ ద్వారా అన్ని గ్రామపంచాయతీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.జనగామ జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీ కార్మికులకు నష్టం కలిగిస్తున్న మల్టీపర్పస్ వర్కర్ విధానం (జీవో నెం.51)ను వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఏళ్ల తరబడి గ్రామపంచాయతీల్లో చాలీచాలని వేతనాలతో పారిశుధ్య పనులు చేస్తున్న కార్మికులను ఆన్లైన్లో నమోదు చేయకుండా,నెలల తరబడి వేతనాలు నిలిపివేయడం అన్యాయమన్నారు.గ్రామాల అవసరాల రీత్యా గ్రామసభల్లో తీర్మానాలతో నియమించుకున్న గ్రామపంచాయతీ సిబ్బందిని కొన్నిచోట్ల“అవసరం లేదు”అంటూ బాధ్యతారహితంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.జిల్లాలో ఎక్కడైనా గ్రామపంచాయతీ కార్మికులను తొలగించే ప్రయత్నం చేస్తే యూనియన్ తరఫున తీవ్రంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని,ఆన్లైన్లో నమోదు కాని కార్మికులను వెంటనే నమోదు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే జిల్లాలో పెండింగ్లో ఉన్న వేతనాలను సత్వరమే చెల్లించాలని,అదనపు కార్మికులకు జీపీ నిధుల ద్వారా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్,డీపీఓలను కోరారు.గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని రాపర్తి రాజు హెచ్చరించారు.