మండల సర్వసభ్య సమావేశం
: ఏఎంసి చైర్మన్ నరుకుడు వెంకటయ్య
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట /జూలై 30
వరంగల్ జిల్లా:వర్ధన్నపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశానికి మండల ప్రత్యేక అధికారి శ్రీపతి అధ్యక్షత వహించారు.ఎం.పి.డి.ఓ జి. వెంకట రమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి వర్ధన్నపేట ఏ.ఎం.సి చైర్మన్ నరుకుడు వెంకటయ్య ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా చైర్మన్ నరుకుడు వెంకటయ్య మాట్లాడుతూ ఇది మొదటి సర్వసభ్య సమావేశం అని, వివిధ శాఖల అధికారులు వేదికపై ఉన్నారని తెలిపారు.వివిధ గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.రాని సమస్యలు ఏమైనా ఉంటే రెండో సమావేశంలో అధికారులను అడగవచ్చని అన్నారు.అయితే అధికారులు చెప్పే విషయాలు వినకుండానే బి.ఆర్.ఎస్,బి.జె.పి సర్పంచులు వాకౌట్ చేయడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామాల అభివృద్ధిపై వారికి శ్రద్ధ లేదని,కేవలం రాజకీయ మనుగడ,నాయకుల మెప్పు కోసమే ఇలా చేస్తున్నారని విమర్శించారు. ఇల్లంద గ్రామంలో అక్రమంగా ఇండ్లు, ఇంటి అరుగులు కూల్చివేత అంశంపై మాట్లాడుతూ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు.గ్రామసభలో లేదా వార్డు సభ్యుల సమావేశంలో తీర్మానం చేసి,బాధితులకు నోటీసులు ఇవ్వాలని,లేకుంటే అన్యాయం జరుగుతుందని అన్నారు.గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రులుగా ఉన్న దయాకర్ రావు, అరూరి రమేష్ గ్రామాన్ని సందర్శించి ఏం చేశారని ప్రశ్నించారు.వారి వద్ద సమాధానం లేదని ఎద్దేవా చేశారు.వర్ధన్నపేట శాసన సభ్యులు కే.ఆర్. నాగరాజు చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేకనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.ఈ సమావేశంలో పి.ఎ.సి.ఎస్ చైర్మన్ కౌడగని రాజేష్ కన్నా,వివిధ శాఖల అధికారులు,సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.