
ఈ 69న్యూస్ స్టేషన్ ఘనపూర్, మార్చి 13: చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని రూ.10 కోట్లతో అభివృద్ధి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.ఆలయ అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించి, రెండు నెలల్లో ముఖ్యమంత్రి నుంచి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు.చిల్పూర్ మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యేకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు.ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులకు దేవాదాయ శాఖ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పాలకవర్గం సభ్యులు ఆలయ చైర్మన్గా పొట్లపల్లి శ్రీధర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.రెండోసారి ఆలయ కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి శ్రీధర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పొట్లపల్లి శ్రీధర్ రావు భక్తి భావంతో పాటు సేవా భావంతో కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారని ప్రశంసించారు. స్వంత ఖర్చులతో ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చిల్పూర్ శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.ఈ ఆలయంలో స్వామి వారిని దర్శించుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించినట్లే ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం ఉందని చెప్పారు.ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించనున్నట్లు తెలిపారు. ఆలయానికి ఎదురుగా ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇతర ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇప్పటికే ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, పాలకవర్గ సభ్యులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ అర్చకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.