జనగాం ఏసీపీ కార్యాలయంలో భరోసా కేంద్రం ప్రారంభం
మహిళలు, చిన్నారుల భద్రతకు మరింత బలమైన రక్షణ వలయాన్ని ఏర్పరచే దిశగా జనగాం ఏసీపీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శివధర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, మహిళలు మరియు చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు తక్షణ సహాయం, కౌన్సెలింగ్, న్యాయ పరిరక్షణ అందించడంలో భరోసా కేంద్రాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు.బాధితులకు ఒకే చోట అన్ని సేవలు అందే విధంగా ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగమని పేర్కొన్నారు.కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ డీజీపీకి, సీపీకి పుష్పగుచ్చం అందించి సన్మానించారు. జిల్లా స్థాయిలో మహిళా భద్రతపై సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.భరోసా కేంద్రం ద్వారా బాధితులకు మానసిక పరామర్శ, న్యాయ సలహాలు, పునరావాస సేవలు అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు.