
ఈ69న్యూస్ జనగామ,జూలై 6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల శ్రమను దోచుకునే విధంగా జీవో నెం.282ని జారీ చేసి 8 గంటల పని దినాన్ని 10 నుంచి 12 గంటలకు పెంచే ప్రయత్నం చేస్తోందని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామలో మాట్లాడుతున్న ఆయన,ఈ జీవోను వెంటనే ఉపసంహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు.రాష్ట్రంలో పారిశ్రామిక వర్గానికి లాభాలు చేకూర్చడానికే ఈ జీవోను తెచ్చారని మండిపడ్డారు. “ప్రపంచ వ్యాప్తంగా కార్మికులు పోరాడి సాధించిన 8 గంటల పని హక్కును ప్రభుత్వాలు కాలరాసే ప్రయత్నం చేస్తున్నాయి.బ్రిటిష్ కాలంలో కూడా కార్మికుల హక్కులు రక్షించబడ్డాయి. అయితే నేటి ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి” అని విమర్శించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలవుతోన్న లేబర్ కోడ్లను తెలంగాణలో కూడా నెమ్మదిగా అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అసంఘటిత రంగ కార్మికులు, హమాలీలు, భవన కార్మికులు, కాంట్రాక్ట్ – అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, స్కీం వర్కర్లు తదితరులు ఇప్పటికే తక్కువ వేతనాలతో, భద్రత లేకుండా పనిచేస్తున్నారని, ఈ నేపథ్యంలో పని గంటలు పెంచడం అత్యంత దారుణమని పేర్కొన్నారు.
జూలై 9న సార్వత్రిక సమ్మె
కార్మిక హక్కుల పరిరక్షణ కోసం జూలై 9న దేశవ్యాప్తంగా జరుగబోయే సార్వత్రిక సమ్మెలో రాష్ట్రంలోని అన్ని వర్గాల కార్మికులు, రైతులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని రాపర్తి రాజు పిలుపునిచ్చారు.జీవో 282 ఉపసంహరణ, కనీస వేతనం రూ.26,000, అసంఘటిత రంగ కార్మికులకు నెలకు రూ.9,000 పెన్షన్ తదితర డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మె జరుగుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరిస్తూ, కార్మికుల శ్రమను గౌరవించే విధంగా ప్రభుత్వం తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.