
మాజీ సర్పంచ్ అన్నెపు పద్మా అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు
బంజారా మహిళల నృత్యాలతో సందడిగా మారిన గ్రామం
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం తమ్మడపల్లి (జి) గ్రామంలో హోళీ పండుగను ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం నుంచే గ్రామం మొత్తం రంగుల కేళితో కళకళలాడింది. చిన్నారుల నుండి పెద్దల వరకు ఆడ–మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పరస్పరం రంగులు చల్లుకుంటూ హోళీ సంబరాల్లో పాల్గొన్నారు.డప్పుల సప్పుళ్ల మధ్య యువత నృత్యాలు చేస్తూ గ్రామ వీధులను సందడిగా మార్చారు. ఈ సందర్భంగా బంజారా యువతీ–మహిళలు సంప్రదాయ దుస్తుల్లో లంబాడీ నృత్యాలు ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.జానపద గీతాలు, డప్పు చప్పుళ్లతో గ్రామం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది.మాజీ సర్పంచ్ అన్నెపు పద్మా అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తులు ఏకతాటిపై నిలబడి పాల్గొనడం విశేషం. పార్టీలకు, కుల–మత భేదాలకు అతీతంగా గ్రామ ప్రజలు ఐక్యంగా పండుగను జరుపుకోవడం గ్రామ ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్, సర్పంచ్ అన్నం స్వప్న బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ హోళీ పండుగ గ్రామంలో సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తోందని తెలిపారు. రాజకీయాలు, కుల–మత భేదాలు పక్కనబెట్టి అందరూ కలిసికట్టుగా పండుగ జరుపుకోవడం గ్రామాభివృద్ధికి మంచి సంకేతమన్నారు.గ్రామస్తుల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు, సహకార భావం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. యువత సంప్రదాయాలను కాపాడుతూ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే రోజుల్లో కూడా అన్ని పండుగలను ఇదే ఐక్యతతో జరుపుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ముక్కెర గంగరాజు, మాజీ సర్పంచ్లు అన్నెపు పద్మా అశోక్, మారపెల్లి ప్రభాకర్, కంటెస్టెడ్ సర్పంచ్ ముహమ్మద్ బషీర్, మారపల్లి రవి, బుర్ర వంశీ గౌడ్, ఖాసిం, తొనుపునూరి దామోదర్, హాజీమియా, మహబూబ్ పాషా, యాదగిరి, రాజ్ కుమార్, కరుణాకర్, రాజు, మధు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.