నకిలీ టీ పౌడర్‌పై మెరుపు తనిఖీలు
నకిలీ టీ పౌడర్‌ను గుర్తించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు
హన్మకొండ జిల్లా పరిధిలో నకిలీ ఆహార పదార్థాల తయారీ,విక్రయాలను అరికట్టేందుకు ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు పోలీస్ శాఖ సంయుక్తంగా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో గురువారం గూడెప్పాడ్ సెంటర్‌కు సమీపంలో ఉన్న ఎంఎం మార్ట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.తనిఖీల సందర్భంగా వినియోగదారులకు విక్రయానికి ఉంచిన దాదాపు 40 కిలోల నకిలీ టీ పౌడర్‌ను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.నాణ్యత ప్రమాణాలకు పూర్తిగా విరుద్ధంగా,అనుమానాస్పదంగా ఉన్న ఈ టీ పౌడర్ ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.స్వాధీనం చేసుకున్న టీ పౌడర్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి,మౌనికలు ప్రజలకు మరియు వ్యాపారులకు నకిలీ టీ పౌడర్‌ను ఎలా గుర్తించాలో ప్రత్యక్షంగా డెమో నిర్వహించి చూపించారు.టీ పౌడర్ రంగు అసహజంగా ఉండడం, వాసనలో తేడాలు, నీటిలో కలిపినప్పుడు రంగు ఎక్కువగా మారడం, మట్టిలాంటి అవశేషాలు కనిపించడం వంటి లక్షణాలు నకిలీ టీ పౌడర్‌కు సూచనలని వివరించారు.అలాగే నాణ్యమైన టీ పౌడర్ వాసన, రుచి సహజంగా ఉంటుందని తెలిపారు.నకిలీ టీ పౌడర్‌ను వినియోగించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు,ఆరోగ్యపరమైన అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు.ప్రజలు ఎల్లప్పుడూ నమ్మకమైన బ్రాండ్లను,సరైన లేబులింగ్,తయారీ తేదీ,గడువు తేదీ ఉన్న ఆహార పదార్థాలనే కొనుగోలు చేయాలని సూచించారు.అనుమానాస్పద ఆహార పదార్థాల విక్రయం లేదా నిల్వలు గుర్తించిన వెంటనే ఫుడ్ సేఫ్టీ శాఖకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.నకిలీ ఆహార పదార్థాల విక్రయానికి పాల్పడిన వారిపై ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఈ తనిఖీల్లో పరకాల రూరల్ సీ.ఐ. రంజిత్ రావు,శాయంపేట ఎస్సై పరమేశ్వర్, దామెర ఎస్సై కొంక అశోక్ పాల్గొని ఫుడ్ సేఫ్టీ అధికారులకు పూర్తి సహకారం అందించారు.ప్రజల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,నకిలీ ఆహార పదార్థాలపై ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు