జీవనాధారం కోల్పోయిన రైతు
•ఎర్త్ వైరుకు కరెంట్ రావడంతో అక్కడికక్కడే మృతి,లక్ష రూపాయల జీవనాధారం కోల్పోయిన రైతు
•‘ప్రభుత్వం ఆదుకోవాలి’- బాధితుడు ఆరేల్లి ఎల్లయ్య వేడుకోలు,గ్రామంలో ప్రమాదకర లైన్లు సరిచేయాలని డిమాండ్
తెలుగు గళం న్యూస్ వర్ధన్నపేట/జూన్ 12
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామంలో విద్యుత్ శాఖ అలసత్వం ఒక నిరుపేద రైతు కుటుంబాన్ని రోడ్డున పడేసింది. గ్రామానికి చెందిన ఆరేల్లి ఎల్లయ్య ప్రతిరోజూలాగే తన గేదెలను మేపడానికి తీసుకెళ్తుండగా,విద్యుత్ స్తంభం నుంచి వచ్చే ఎర్త్ వైరుకు కరెంట్ సరఫరా కావడంతో ఒక గేదె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.కుటుంబానికి పెద్ద దెబ్బ: సూది పాడి గేదె మృతి
సుమారు లక్ష రూపాయల విలువ చేసే సూది పాడి గేదె ఒక్కసారిగా మృతి చెందడంతో ఎల్లయ్య తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.“ఈ గేదె పాల మీదే నా కుటుంబం ఆధారపడి బతుకుతోంది.ఇప్పుడు ఆ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. అప్పులు ఎలా తీర్చాలి”అంటూ కన్నీరుమున్నీరయ్యాడు.తన జీవనోపాధిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.
అధికారుల నిర్లక్ష్యంపై మండిపాటు
ఇది ముమ్మాటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని బాధితుడితో పాటు గ్రామస్తులు మండిపడుతున్నారు.గతంలోనే పలుమార్లు వదులుగా ఉన్న వైర్లు, ఎర్త్‌కు కరెంట్ వస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు.“ఈ రోజు గేదె పోయింది, రేపు మనుషులు పోతే ఎవరు బాధ్యత వహిస్తారు?”అని ప్రశ్నిస్తున్నారు.
తక్షణ చర్యలు చేపట్టాలి: గ్రామస్తులుగ్రామంలో ఇంకా అనేక చోట్ల విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని,ట్రాన్స్ఫార్మర్ల దగ్గర రక్షణ చర్యలు లేవని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి గ్రామంలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టి, ప్రమాదకర పరిస్థితులను సరిచేసి విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడాలని కోరుతున్నారు.
బాధిత రైతు ఆరేల్లి ఎల్లయ్యకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామ పెద్దలు విజ్ఞప్తి చేస్తున్నారు.