ప్రజలంతా సుఖసంతోషాలతో,సుభిక్షంగా జీవించాలి
సమ్మక్క–సారలమ్మ తల్లుల చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండి,నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆకాంక్షించారు.గురువారం సాయంత్రం రేగొండ మండలం తిరుమలగిరి గ్రామ శివార్లలో ప్రకృతి ఒడిలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరలో ఆయన పాల్గొని తల్లులను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు.ఈ సందర్భంగా మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజన ఆదివాసీ సమాజానికి ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారలమ్మ తల్లులు భక్తుల కోరికలను నెరవేర్చే శక్తిమంతమైన వనదేవతలని పేర్కొన్నారు. ప్రజల కష్టాలను తొలగిస్తూ, సుఖశాంతులు ప్రసాదించే తల్లుల దర్శనం ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందని అన్నారు.నియోజకవర్గంలో నిర్వహిస్తున్న అన్ని మినీ మేడారం జాతరలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, రహదారులు తదితర మౌలిక సదుపాయాలను సమకూర్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసుకునేలా అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు.జాతర సందర్బంగా జీఎస్సార్ జాతర ప్రాంగణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆవిష్కరించారు. ప్రభుత్వం ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, సంప్రదాయ పండుగలు, జాతరల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.