మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
మున్సిపల్ ఎన్నికలు ప్రభుత్వానికి గుణపాఠం కావాలి–మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఈ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులా ఉండాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు.భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో ఆయన,వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పాల్గొన్నారు.ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని,అభివృద్ధి పనులు పూర్తిగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. “కేసీఆర్ ఎక్కడున్నారు?” అంటూ ప్రజలే ప్రశ్నిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే ప్రజల సంక్షేమం, రైతుల భరోసా, పేదల హక్కుల కోసం కేసీఆర్ లాంటి బలమైన నాయకత్వం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గతంలో చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ ప్రజలకు కనిపిస్తున్నాయని, కానీ ప్రస్తుతం పాలకులు ఒక్క కొత్త అభివృద్ధి పనిని కూడా చేపట్టలేదని విమర్శించారు.మూసీ సుందరీకరణ, హైడ్రా పేర్లతో పేదల ఇళ్లను కూల్చివేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అవసరాలను పక్కనపెట్టి అర్థంలేని పనులపై నిధులు ఖర్చు చేయడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు.భూపాలపల్లి జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం కీలకమని గుర్తుచేశారు. భూపాలపల్లి అభివృద్ధి కొనసాగాలంటే బిఆర్ఎస్ జెండా మళ్లీ ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ కౌన్సిలర్లు గెలిస్తేనే పట్టణానికి కావాల్సిన అభివృద్ధి, ప్రజలు ఆశించే మార్పులు సాధ్యమవుతాయని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించిన చరిత్ర బిఆర్ఎస్కు ఉందని, అందరూ ఐక్యంగా నిలబడి విజయం సాధించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.