
రెండేళ్లలో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు మారుస్తాం
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్, జూలై 1
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సూచించారు. స్టేషన్ ఘనపూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన నాలుగో సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని కౌన్సిలర్లు, అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షపు నీరు, మురుగు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, కాలనీల్లో గడ్డి, చెట్ల పొదలు, శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించాలని ఆదేశించారు. ఇళ్ల నుంచి రోడ్లపైకి నీరు రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను తొలగించాలని, కౌన్సిలర్లు తమ వార్డుల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను గుర్తించాలని సూచించారు.మొదటి విడత టెండర్ పనులను త్వరగా పూర్తి చేసి, రెండో విడత అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ప్రతి వార్డుకు రూ.10 లక్షలు, 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఆన్లైన్లో నమోదు కాని ఇళ్లను వెంటనే నమోదు చేయాలని, 18 వార్డుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే ప్రతి నెల 1వ తేదీన పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించాలని, 100 శాతం పన్నుల వసూళ్లపై దృష్టి పెట్టాలని సూచించారు.మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, డిగ్రీ కళాశాలతో పాటు రూ.50 కోట్ల అభివృద్ధి పనులను పూర్తి చేసి రానున్న రెండేళ్లలో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మార్చేస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కమిషనర్ రాధాకృష్ణ, వైస్ చైర్మన్ నీల రాజమ్మ, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.