భూపాలపల్లిలో ఘనంగా మారోజు వీరన్న 64వ జయంతి వేడుకలు
తెలుగు గళం న్యూస్ భూపాలపల్లి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో, భూపాలపల్లి పట్టణంలో ప్రముఖ ప్రజాగాయకుడు, ప్రజాపోరాట యోధుడు మారోజు వీరన్న 64వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు రవి పటేల్ ముఖ్య అతిథిగా హాజరై జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ, 1962 జనవరి 1న సూర్యపేట జిల్లాలో జన్మించిన మారోజు వీరన్న తన గళం,ఆటపాటల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు సహా బహుజనుల సమస్యలను ప్రజల ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలను ప్రజల భాషలో చెప్పగలిగిన గొప్ప ప్రజాగాయకుడు, ప్రజలను చైతన్యపరిచిన మహనీయుడు మారోజు వీరన్న అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా లక్షలాది మందిని బహుజన రాజ్యాధికార దిశగా చైతన్యం చేసిన అరుదైన వ్యక్తిత్వమన్నారు.మారోజు వీరన్న ఆశయాలను కొనసాగిస్తూ నేటి కాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం రాజకీయంగా, సామాజికంగా, విద్యా–వైద్య రంగాల్లో నిరంతర పోరాటం చేస్తున్న నాయకుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న అని రవి పటేల్ పేర్కొన్నారు. ఆయన మరో మారోజు వీరన్నలా బహుజనులను రాజ్యాధికార సాధన దిశగా నడిపిస్తున్నారని ప్రశంసించారు.భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచే ప్రజాపోరాట యోధులు, మహనీయుల జయంతులు, వర్ధంతులు టీఆర్పీ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. మహనీయులను స్మరించుకోవడమే కాకుండా, వారి ఆశయాలను ఆచరణలో పెట్టడమే పార్టీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్పీ పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్, జినుకల శ్రీను, ప్రణీత్ తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.