
ఈ69న్యూస్ నల్గొండ:
మల్లు స్వరాజ్యం జీవితం నేటి యువతకు ఆదర్శప్రాయమని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పాలడుగు ప్రభావతి పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నాల్గవ వర్ధంతి సందర్భంగా నల్లగొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ, “దున్నేవాడికే భూమి కావాలి”, “వెట్టి చాకిరి నిర్మూలించాలి” అనే నినాదాలతో సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన మహా యోధురాలు మల్లు స్వరాజ్యం అని కొనియాడారు. చిన్న వయస్సులోనే ఉద్యమాల్లోకి ప్రవేశించి, మహిళల రక్షణ కోసం గెరిల్లా దళాల్లో చేరి తుపాకి పట్టిన ధైర్యసాహసాల ప్రతీకగా నిలిచారని తెలిపారు.
తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో సామంత వ్యవస్థ, జాగిర్దారీ విధానాలు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితం చేసి పోరాటాలు నడిపిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఈ పోరాట ఫలితంగా సుమారు 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచబడగా, వేలాది గ్రామాలు జాగిర్దారుల ఆధీనంలోనుంచి విముక్తి పొందాయని వివరించారు. ఈ ఉద్యమంలో వేలాది మంది అమరులు ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు.
ఈ పోరాటాల ఫలితంగానే తెలంగాణలో భూ పంపిణీ జరిగి పేదలు, మహిళలకు కొంతమేర విముక్తి లభించిందని, ఆ స్ఫూర్తిని నేటి తరాలు కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రభావతి పిలుపునిచ్చారు.
ప్రస్తుతం కూడా మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పురుషులతో సమాన కూలి అందకపోవడం, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వెట్టి చాకిరి కొనసాగడం, పని ప్రదేశాల్లో వేధింపులు, గృహహింస, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలు సంఘటితమై హక్కుల సాధన కోసం పెద్దఎత్తున ఉద్యమాల్లోకి రావాలని సూచించారు.
యువత, ముఖ్యంగా యువతులు సామాజిక న్యాయం కోసం ముందుకు రావాలని, దోపిడీదారులపై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం వంటి మహనీయుల త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి సమాజ నిర్మాణానికి మార్గదర్శకమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ మేకల వర్ణ, నాయకులు రమావత్ పార్వతి, లక్ష్మీ, నాగమణి, బబ్బి తదితరులు పాల్గొన్నారు.