
ఈ69న్యూస్ జనగామ, మార్చి 17:
మహిళా సంఘాలు వ్యవసాయ రంగంలో ముఖ్య పాత్ర వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మార్క్ఫెడ్ ప్రతినిధులు, వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కజొన్న సాగు మరియు కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నందున వాటికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోళ్లలో అనుభవం ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యత ఇస్తే రైతులకు మంచి ప్రయోజనం ఉంటుందని సూచించారు.
అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా జిల్లాకు కేటాయించిన డ్రోన్లను మహిళా సంఘాల ద్వారా అందిస్తే రైతులకు మరింత సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఆసక్తి ఉన్న మహిళా సంఘాల నుంచి దరఖాస్తులు స్వీకరించి డ్రోన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
రాబోయే రోజుల్లో ఎరువుల కొరత లేకుండా గ్రామస్థాయిలో రైతులకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు సులభంగా అందించేందుకు మహిళా సంఘాలు ముందుకు రావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఇందుకోసం అన్ని క్లస్టర్లలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఎరువుల దుకాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అంబికా సోని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వసంత, ఏడిఏలు, అడిషనల్ పీడీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.