మాజీ ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన సర్పంచ్‌లు
భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు మరియు వార్డు సభ్యులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.శాయంపేట మండలం సూర్యనాయక్ తండా గ్రామ సర్పంచ్ లావుడ్య రమ రవీందర్, ఉప సర్పంచ్ మాలోతు సునీత భాస్కర్‌తో పాటు వార్డు సభ్యులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా నర్సింహులపల్లి గ్రామ సర్పంచ్ గోనె నాగరాజు, చిట్యాల మండలం నవాబ్‌పేట గ్రామ వార్డు సభ్యులు కూడా మాజీ ఎమ్మెల్యేను కలిసి గ్రామాల అభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా గండ్ర వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ, గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాప్రతినిధులు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు.గ్రామపంచాయతీ పాలనలో ఐక్యత, సమన్వయం చాలా ముఖ్యమని పేర్కొన్న ఆయన, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు కలిసి పనిచేస్తే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.ఈ భేటీ గ్రామాభివృద్ధిపై సానుకూల చర్చలకు దారితీసిందని, భవిష్యత్తులో ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని నాయకులు వెల్లడించారు.