మాతృ,శిశు మరణాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలి-జిల్లా కలెక్టర్
జిల్లా కలెక్టరేట్ (సమన్వయ కార్యాలయాల సముదాయం) లోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం శిశు మరణాల సమీక్ష మరియు మాతృ మరణాల సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా పాల్గొని వైద్య అధికారులతో కలిసి మరణాలకు గల కారణాలపై సుదీర్ఘంగా చర్చించారు.రెండు వేల ఇరవై నాలుగు-ఇరవై ఐదు మరియు రెండు వేల ఇరవై ఐదు-ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించిన కేసులను సమగ్రంగా సమీక్షించిన కలెక్టర్,భవిష్యత్తులో ఇలాంటి మరణాలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ప్రతీ గర్భిణీ మరియు శిశువు ఆరోగ్యం పట్ల మెడికల్ అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లావ్యాప్తంగా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలన్నారు.అధిక ప్రమాదం ఉన్న గర్భిణీలను (హై రిస్క్ కేసెస్) ముందుగానే గుర్తించి,సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారిని సరైన సమయంలో మెరుగైన ఆసుపత్రులకు పంపాలని సూచించారు.వంద శాతం ప్రసవాలు ఆసుపత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని,గర్భధారణకు ముందు మరియు ప్రసవం తర్వాత అందించే సేవలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు,పరికరాలు ఉండాలని,ఇరవై నాలుగు గంటల పాటు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు.ఆశా కార్యకర్తలు,ఏఎన్ఎంల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని కోరారు.ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,రిఫరల్ ఆసుపత్రులు మరియు ప్రైవేట్ ఆసుపత్రుల మధ్య సమన్వయం పెరగాలని సూచించారు.నివారించగలిగే మరణాలను అడ్డుకోవడంలో అధికారులు,సిబ్బంది బాధ్యత వహించాలని,తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.మల్లికార్జున రావు తో పాటు సంబంధిత కమిటీ సభ్యులు మరియు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.