
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో మానసిక దివ్యాంగ చిన్నారులతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుటుంబ సమేతంగా ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు కొత్త బట్టలు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ, ఎమ్మెల్యే స్వయంగా పిల్లలకు భోజనం వడ్డించడం విశేషం. అదనంగా రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
25 ఏళ్ల అనుబంధంతో సేవలు:మల్లికాంబ మనోవికాస కేంద్రంతో తమ కుటుంబానికి దాదాపు 25 ఏళ్ల అనుబంధం ఉందని వారు తెలిపారు. ప్రతి సంవత్సరం పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో చిన్నారులకు బట్టలు, ఆర్థిక సహాయం అందిస్తూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
అపోహలు తొలగించాలి: ఎంపీ కడియం కావ్యఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులపై సమాజంలో ఉన్న అపోహలు, వివక్ష తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆధార్ లింకేజీ సమస్యల వల్ల పలువురు దివ్యాంగులు పెన్షన్, వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ అంశాలను పార్లమెంట్లో ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆటిజం వంటి సమస్యలపై అవగాహన పెంచాలని, సేవా సంస్థలకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
సి.ఎస్.ఆర్ నిధులు సేవా సంస్థలకు మళ్లించాలి: ఎమ్మెల్యే శ్రీహరి.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ మానసిక దివ్యాంగ చిన్నారుల కోసం పనిచేసే సంస్థలకు ప్రభుత్వ సహాయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమలు, వ్యాపారవేత్తలు సి.ఎస్.ఆర్ నిధులను ఇలాంటి సేవా సంస్థలకు మళ్లించాలని కోరారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని, మరిన్ని ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు రామలీల, కళ్యాణ్, మాజీ కార్పొరేటర్ మాధవి, వినయరాణి తదితరులు పాల్గొన్నారు.





