మినీ సమ్మక్క–సారలమ్మ జాతరలు ప్రారంభం
భక్తులకు మెరుగైన వసతులు కల్పించాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
భక్తులు ప్రశాంత వాతావరణంలో సమ్మక్క–సారలమ్మ తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం, జిట్టేగూడెం–తాటికొండ, చిల్పూర్ మండలం గార్లగడ్డ తండా–ఫతేపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న మినీ సమ్మక్క–సారలమ్మ జాతరల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
జాతరకు వచ్చే భక్తుల కోసం త్రాగునీటి సరఫరా సౌకర్యాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య ఏర్పాట్లు, రోడ్ల మరమ్మతులు, హై మాస్ ఫ్లడ్ లైట్లు వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ…
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని మినీ సమ్మక్క–సారలమ్మ జాతరలలో శాశ్వత నిర్మాణాలు చేపట్టి, వచ్చే జాతర నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. జాతరలకు భారీగా భక్తులు తరలివస్తారని ముందుగానే అంచనా వేసి త్రాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, లైటింగ్, వైద్య శిబిరాలు, పోలీస్ బందోబస్తు వంటి అన్ని ఏర్పాట్లు సమన్వయంతో చేస్తున్నామని చెప్పారు.
భక్తులు అధికారులు, జాతర కమిటీలకు సహకరిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని, దర్శనం అనంతరం సురక్షితంగా తమ తమ గ్రామాలకు చేరుకోవాలని సూచించారు. వన దేవతల దీవెనలతో నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.