“మీ డబ్బు-మీ హక్కు”-అదనపు కలెక్టర్
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు,ఆర్థిక రంగంలో క్లైమ్ చేయని ఆస్తుల పరిష్కారం కోసం“మీ డబ్బు-మీ హక్కు”అనే ట్యాగ్‌లైన్‌తో జాతీయ స్థాయిలో మూడు నెలల ప్రత్యేక ప్రచారం చేపట్టినట్లు జిల్లా అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ తెలిపారు.ఈ ప్రచారం అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31,2025 వరకు కొనసాగుతుందని ఆయన చెప్పారు.ప్రజలకు సంబంధించిన కానీ ఇప్పటివరకు క్లైమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు,షేర్లు,డివిడెండ్లు,మ్యూచువల్ ఫండ్లు,బీమా మొత్తాలు వంటి ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేలా అవగాహన కల్పించడమే ఈ ప్రచారం ప్రధాన లక్ష్యమని వివరించారు.ఈ ప్రచారంలో భాగంగా డిసెంబర్ 24న హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సముదాయంలోని ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రత్యేక అవగాహన శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ వై.వి.గణేష్ మాట్లాడుతూ..క్లైమ్ చేయని ఆర్థిక ఆస్తులకు హక్కుదారులు అవసరమైన పత్రాలతో తమ బ్యాంకులు లేదా సంబంధిత ఆర్థిక సంస్థలను సంప్రదించి నిధులను తిరిగి పొందాలని సూచించారు.ప్రభుత్వం చేపట్టిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ప్రాంతీయ మేనేజర్ షేక్ అబ్దుల్ రహీం,ఆర్బీఐ ఏజీఎం ఎం.జెడ్.రెహమాన్,ఎస్బీఐ ఎస్ఎల్బీసీ మేనేజర్ పి.కాళీ ప్రకాష్,హనుమకొండ లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ జన్ను మహేందర్ పాల్గొన్నారు.